బిక్నూరులో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

బిక్నూరులో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మంత్రి సీతక్క చేతుల మీదుగా మహిళలకు బొట్టు పెట్టి చీరల అందజేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20

 

గురువారం: కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. బిక్నూర్ మండల మార్కెట్ యార్డ్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం భాగంగా చీరల పంపిణీ ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శత్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మార్కెటింగ్ చైర్మన్ రాజుతో కలిసి మహిళలకు బొట్టు పెట్టి చీరలు, సారెలను ప్రత్యేకంగా అందజేశారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా వేలాది మహిళలు హర్షాతిరేకాలతో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ— మహిళల ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి మహిళ పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. “ఇందిరా గాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళా ‘ఉక్కు మహిళ’గా ఎదగాలి” అని ఆమె నొక్కిచెప్పారు. మహిళల ధైర్యం, పట్టుదల దేశాభివృద్ధికి ఆధారం అని, ఇందిరాగాంధీ చూపిన నాయకత్వం ఈ తరం మహిళలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతినిమేరకు నవంబర్ 19న కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తున్నదని అన్నారు. బిక్నూర్ మండల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ— జిల్లాలో చీరల పంపిణీని పూర్తిగా షెడ్యూల్‌ ప్రకారం, ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి చీరల అందజేతగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామని, డిసెంబర్ 9 వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now