ధనిక దేశాల దురాశ × ప్రజల అవసరాలు..
ప్రబీర్ పుర్కాయస్థ
(ఐక్యరాజ్యసమితి కాప్-29 సదస్సు అజర్‌బైజాన్‌లో (నవంబర్ 11-22) జరుగుతున్న సమయంలో రాసిన వ్యాసమిది)
ఈ వేసవి కాలంలో భూగోళమంతటా పెరిగిన తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాయి. వాతావరణ సదస్సు ఒప్పందాలను ఏమాత్రం ఒప్పుకోని డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో కాప్-29 సదస్సు జరిగింది.
గ్లోబల్ వార్మింగ్ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో కొందరు క్లైమెట్ శాస్త్రవేత్తల హెచ్చరికలకో పరిమితమైనది కాదు. ఆ ఫలితాలను ఇప్పుడు స్వయానా అనుభవిస్తున్నాం. ఉత్తర భారతం లోనే కాదు. యూరోప్‌లో కూడా ఉష్ణోగ్రత రికార్డులు బద్దలవుతున్నాయి. భూ ష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గించాలనే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలను, 20 ఏళ్లకు లెక్కించి చెప్పాలనే సాంకేతిక కారణం పక్కన పెడితే, ఇప్పటికే 1.5 డిగ్రీల మార్కును దాటేశాము. వాతావరణ మార్పుల తీవ్రత వల్ల చాలా ప్రాంతాలు నివాసయోగం కాకుండా పోతున్నాయి. వాతావరణ విపరీతాల వల్ల దిగువ ప్రాంతాలే కాక, అన్ని ప్రాంతాలకూ తీవ్రమైన నష్టం జరుగుతోంది. చరిత్రలో ఒక లక్షా 25 వేల సంవత్సరాలకు ముందు మనుషులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆఫ్రికాను వదిలి యురేషియాకు పోతున్న సందర్భం అది. ఇప్పుడు మళ్లీ ఈ వాతావరణ ఆస్థిరతలు ఎక్కడికి దారితీస్తాయో, అర్థం కాని పరిస్థితి ఉంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అది వ్యవసాయం మీద, ప్రజల జీవనాధారాల మీద, ప్రభావం చూపుతాయి. పొలాల్లో, ఫ్యాక్టరీలలో పని చేసే వాళ్ల మీద, వేడి పరిస్థితిలో పని చేసే వాళ్ళందరి మీదా ఈ ప్రభావం ఉంటుంది. శీతాకాలంలో అసాధారణంగా పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉండే మంచు కరిగి, సముద్రాల మట్టాలు వేగంగా పెరుగుతాయి.
ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఆఫ్రికా-ఆసియా-లాటిన్ అమెరికాల సమస్యని గ్లోబల్ నార్త్ (అమెరికా-కెనడా-యూరోప్) అనుకుంటోంది. అయితే ఈ ధనిక దేశాల్లోని సంపన్నులతో సహా వాతావరణ మార్పులకు ఎవరూ అతీతులు కారు. వాతావరణ సంశయ వాదులున్న అమెరికాలోనే, 1980 తరువాత, నాలుగు వందల వాతావరణ ఉత్పాతాలు జరగడం వల్ల ఒక బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదలు, కార్చిచ్చులు, విపరీతంగా పెరుగుతున్నాయి. ధ్రువ ప్రాంతాలలో ఉండే శాశ్వతమైన మంచు పొరలు కరగడం, పెద్ద ఎత్తున మిథేన్ విడుదల కావడం, సముద్రపు అలలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో, ఏ పర్యవసనాలకు దారితీస్తుందో అర్థం కావడం లేదు.
గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించేందుకు, కార్బన్ మార్కెట్లను పునరుద్ధరించే ఆశావహ దృష్టితో, కార్బన్ క్రెడిట్లపై ఒక ఏకాభిప్రాయ ప్రకటనతో కాప్ 29 ప్రారంభమైంది. హరిత వాయు వ్యూహాలకు అవసరమైన నిధుల సమీకరణకు చర్చ జరుగుతున్నప్పుడైతే, ఇటువంటి ప్రకటనలకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద ఉపయోగం లేదు. ఈ కార్బన్ క్రెడిట్ పథకాలన్నీ, కాగితాలకే పరిమితమైనాయి. పేద దేశాలకు (అడవులు ఉంటే), కొంత ఆర్థిక సహాయం అందొచ్చు. అంతేగానీ ఉద్గారాలు తగ్గడం అనుమానమే. ఉదాహరణకు వెర్రా అనే కంపెనీ కార్బన్ క్రెడిట్లను సర్టిఫై చేసే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ. కార్బన్ క్రెడిట్లలో 90 శాతం, ఈ కంపెనీనే అమ్మింది. తాను బాగా డబ్బు చేసుకుంది కానీ, ఉద్గారాలను తగ్గించింది ఏమీ లేదు.
అయితే ఉద్గారాలు తగ్గించేది ఎలా? మళ్లీ మొదటికే వస్తున్నాం. బొగ్గుకు, చమురుకు, సహజ వాయువులకూ బదులుగా గ్రీన్ ఎనర్జీని వాడటమే పరిష్కారం. సౌర, వాయు వనరుల ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు సరఫరా చేయడం, ఈమధ్య చాలా చౌకగా మారింది. కానీ, కారు లాంటి ఎలక్ట్రిక్ వాహనాలకు, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ ఖర్చు వస్తోంది. బ్యాటరీ ధరలు తగ్గడం, కెపాసిటీ పెరగడం లాంటివి ఇందుకు కారణం. గ్రీన్ హౌస్ వాయువులు వెలువడే, స్టీలు, సిమెంటు, ఎరువుల ఉత్పత్తి పారిశ్రామిక ప్రక్రియలకు కూడా ప్రత్యామ్నాయలు కనుక్కోవాల్సి వుంది. అలాగే, సరుకుల దూర రవాణాలో కూడా, ఇంకా అనేక ఉద్గార సమస్యలు ఉన్నాయి
ఈ సంవత్సరం, పెద్ద మార్పులనే చూసింది. కర్బన ఉద్గారాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే చైనా, 2030కు తగ్గించుకోవాల్సిన ఉద్గారాల లక్ష్యాలను, 2023-24కే సాధించింది. చైనా సౌర విద్యుత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. మన దేశం కూడా పునరుత్పాదక ఇంధన రంగాన్ని, విస్తృతపరిచి, పెద్ద భవిష్యత్ ప్రణాళికలనే రచిస్తోంది.
గతంలో ఒక సమస్య ఉండేది. పునరుత్పత్తి విద్యుత్తు ఉత్పత్తిలో ఉండే హెచ్చుతగ్గులకు, రోజువారీ విద్యుత్ స్థిర అవసరాలకు పొసగదు అనేది ఆ సమస్య. అయితే జల విద్యుత్ నిల్వ విధానాల ద్వారా దీన్ని అధిగమించవచ్చు. గ్రిడ్ స్థాయిలో బ్యాటరీలలో నిల్వ ఉంచడం అనే ప్రతిపాదన ఉన్నా, అది అధిక ఖర్చులతో కూడుకున్నది. దాని నిల్వ సామర్థ్యం కూడా తక్కువే. వామపక్ష ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగాల్ పురూలియాలో నిర్మించబడిన జల విద్యుత్ నిల్వ ప్రాజెక్టు మొదటిది. బహుళార్థ సాధక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఉన్నట్టుగా, నీటి నిల్వ కోసం విస్తారమైన భూములను వాడాల్సిన అవసరం ఇందులో ఉండదు.
సౌర విద్యుత్ ప్రపంచంలోనే ఒక కీలకమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతోంది. ఈ విషయంలో చైనా వేగం ఆశ్చర్యం కలిగించదు గాని, మిగిలిన దేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ (సెప్టెంబర్ 2024) కథనం ప్రకారం చైనా 425 జి.డబ్ల్యు సౌరశక్తిని కొత్తగా ఉత్పత్తి చేస్తే, మిగిలిన ప్రపంచమంతా అమెరికా (33 జి.డబ్ల్యు) సహా 162 జి.డబ్ల్యు సౌర శక్తిని మాత్రమే ఉత్పత్తి చేశాయి.
భారతదేశం, 2030 నాటికి 500 జి.డబ్ల్యు పునరుత్పాదక విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 80 శాతం సౌర విద్యుత్తే. ఇది సాధ్యమే. కానీ ఒక్క సౌర విద్యుత్ మీదే కాక, సౌర విద్యుత్ సరఫరా గొలుసుల శక్తిసామర్ధ్యాలను పెంపొందించడానికి కూడా మదుపు చేయాలి. అంటే, సోలార్ ప్యానళ్లు, సోలార్ ప్లాంట్లు మాత్రమే కాక, సిలికాన్ వేఫర్స్, సోలార్ సెల్స్ లాంటి వాటి ఉత్పత్తి మీద శ్రద్ధ పెట్టాలి.
విద్యుత్ రంగం, దాని తర్వాత రవాణా రంగం నుంచి పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ వాయువులు వెలువడతాయనేది నిజమే. ఎలక్ట్రిక్ వాహనాలు (బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు-బి.ఇ.వి) ఈరోజు వ్యక్తిగత రవాణాలో ముందు స్థానంలో ఉన్నాయి. వీటి వాడకం వల్ల పెట్రోలు, డీజిల్ ద్వారా వచ్చే గ్రీన్ హౌస్ వాయువులు తగ్గుతాయి. ఈ బ్యాటరీ టెక్నాలజీలలో చైనా గ్లోబల్ లీడర్‌గా ఉంది. కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో. లిమిటెడ్ (సి.ఎ.టి.ఎల్) కంపెనీ టెస్లాకే బ్యాటరీలు సరఫరా చేస్తున్నది. సి.ఎ.టి.ఎల్, బి.వై.డి లాంటి చైనా కంపెనీలు బ్యాటరీ ఉత్పత్తిలో ప్రపంచంలో ముందు స్థానంలో ఉండటమే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కూడా ప్రవేశిస్తున్నాయి. బి.వై.డి ఒక ప్రధానమైన కార్ల ఉత్పత్తిదారుగా తయారైంది. సి.ఎ.టి.ఎల్ ఇతరులతో భాగస్వామ్యం ఉండటమే కాకుండా, చైనాలో గ్రిడ్ స్టోరేజీలకు కూడా ఒక ప్రధాన సరఫరాదారుగా ఉంటున్నది.
ఇండియాలో కూడా అమర్ రాజా లాంటి స్వదేశీ బ్యాటరీ సరఫరాదార్లు ఉన్నారు. ఇండియన్ కార్ల ఉత్పత్తిదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అమెరికా ఇక్కడ కూడా వెనుకే. ఒక ఎలక్ట్రిక్ వాహనం ధరలో 50 శాతం బ్యాటరీలకే ఖర్చవుతుంది. కానీ ఎలన్ మస్క్ చేస్తున్న మాయలో పడి అమెరికా బ్యాటరీ రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. టెస్లాకు పైస్థాయి ధనికుల మార్కెట్ కావాలి. మాస్ మార్కెట్ కాదు. కాబట్టి చైనాను పోటీదారుగా భావించదు.
చైనా బ్యాటరీ ఉత్పత్తిదారులు, యూరోప్ మార్కెట్లోకి, అక్కడి కార్ల ఉత్పత్తిదారులతో జత కలసి, చొచ్చుకుపోతున్నారు. ధర నాణ్యతల విషయంలో చైనాకు సమ ఉజ్జీలు కాలేకున్నా, అమెరికా, యూరోప్‌లు టారిఫ్ అడ్డంకులు పెడుతున్నాయి. ఒక విధంగా క్లైమేట్ లక్ష్యాలను బలి పెడుతున్నాయి.
పునరుత్పాదక ఇంధనాలను విస్తరణ, సరఫరా లేదా ఇతర పరిశ్రమలలో వాటి వినియోగంలో వస్తున్న వాస్తవ సమస్యలు, కాప్ 29కు పట్టవు. కార్బన్ ఈక్విటీ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ, కనీసం ధనిక దేశాలు పర్యావరణానికి చేసిన నష్టాలకు కొంతయినా బాధ్యత వహించాలి. భవిష్యత్తుకు బాధ్యత తీసుకోవాలి. అరకొర నిధులు ఇచ్చి చేతులు కడుక్కుంటామంటే కుదరదు.
ఇప్పుడు భూగోళం ఒక ప్రమాదపు అంచున ఉంది. ఇక వెనక్కు తీసుకోలేనంతగా వాతావరణ మార్పులు జరుగు తున్నాయి. ఇది ఇక ఒక్క ధనిక దేశాల సమస్య మాత్రమే కాదు. అయితే వారి దృష్టి అంతా ఇప్పుడు ఉక్రెయిన్‌లో రష్యాను ఏ విధంగా సైనికంగా ఓడించాలి, చైనాను ఆర్థికంగా ఎట్లా చుట్టుముట్టాలి అనేదే. పాలస్తీనాలో మానవ హననం జరిగినా సరే. చమురు సమృద్ధిగా వున్న పశ్చిమాసియాను లొంగదీసుకోవడానికి ఇజ్రాయిల్‌ను ప్రయోగించడం, మిగిలిన ప్రపంచంపై ఆధిపత్యం చలాయించడం ఎలా? అన్నదే వారి ఆసక్తి.
ఇదే వారి సూత్ర బద్ధత (రూల్ బేస్డ్ ఆర్డర్). జి7 దేశాలు, ప్రకృతి నియమాలకే కాదు. ఇతర దేశాలకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. తమ పెత్తనాన్ని నిలుపు కోవడానికి గుప్పెడన్ని ధనిక దేశాలు అందరి భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మెరుగైన ప్రపంచాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేది పెద్ద సవాలు.
( స్వేచ్ఛానుసరణ )
ప్రబీర్ పుర్కాయస్థ