*చార్మినార్ జోన్‌లోనూ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్..!*
*జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో సీసీఎల్ఏను కలిసిన నాయకులు*
*అతి త్వరలోనే ప్రారంభం కానున్న పదోన్నతుల ప్రక్రియ*
చార్మినార్ జోన్‌లోనూ సీనియర్ అసిస్టెంట్ నుండి నాయబ్ తహసీల్దార్ వరకు పదోన్నతుల ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని రెవెన్యూ జేఏసీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి తెలిపారు. కోర్టు కేసు కారణంగా కేవలం చార్మినార్ జోన్‌లోనే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జోన్లల్లో సీనియర్ అసిస్టెంట్ నుండి డిప్యూటీ తహశీల్దార్ వరకు పదోన్నతులను రెవెన్యూ జేఏసీగా ఇప్పటికే ఇప్పించడం జరిగిందన్నారు.
మంగళవారం రెవెన్యూ జేఏసీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో సీసీఎల్ఏ లోకేష్‌కుమార్‌ను డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, తదితరులు కలిసి పదోన్నతుల గురించి వివరించారు. అర్హులకు వెంటనే పదోన్నతులను ఇవ్వాలని కోరారు.
చార్మినార్ జోన్‌లో కోర్టు కేసు కారణంగానే పదోన్నతుల ప్రక్రియ నిలిచిందన్నారు. కోర్టు కేసు పరిష్కారం కావడంతో ఆగిపోయిన సీనియర్ అసిస్టెంట్ నుండి నాయబ్ తహసీల్దార్ పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టి, వేగవంతం చేయాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ లోకేష్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే పదోన్నతుల ప్రక్రియను చేపట్టి అర్హులందికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.