*_యాసంగికి జల గండం .. రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు.._*
ఎండుతున్న వరి పంటను చూసి దిగులు చెందుతున్న రైతన్న
నాలుగు తడులు అందితే పంట చేతికొస్తుందని ఆవేదన
కెనాల్స్ లేని నాన్కమాండ్ ఏరియాలో పరిస్థితి ఘోరం
అప్పులు చేసి కొత్త బోర్లు తవ్విస్తున్న రైతులు
1000 ఫీట్లు తవ్వినా జాడలేని నీటి ధార
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : యాసంగి పంట చేతికొచ్చేది అనుమానమే. ఎండలు రోజురోజుకూ ముదురుతున్నయ్.. అదే స్పీడ్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్.. నాలుగు తడులైతే పంట చేతికొస్తదని రైతన్న విలవిల్లాడుతున్నాడు. అప్పులు చేసి బోర్లు వేసినా నీటి ధార జాడ లేక గుండెలు బాదుకుంటున్నడు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ లో వరి పంట పరిస్థితి మరీ దారుణం. కెనాల్ ఇరిగేషన్ లేని నాన్ కమాండ్ ప్రాంత వరి పొలాలు ఎండుతున్నాయి. నెలన్నర కిందటే బోర్లల్లో నీళ్లు తగ్గాయి. సగం పంటనైనా దక్కించుకుందామని బోర్లు వేయించినా నీళ్లు రాక.. రైతన్నకు కంటనీరే మిగులుతున్నది.
*_వరిసాగు పెంచిన వడ్ల బోనస్.._*
జిల్లాలో 5.18 లక్షల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేశారు. అందులో 4.19 లక్షల ఎకరాలు వరి సాగు కాగా, 95 శాతం సన్నరకాలే. గతేడాది యాసంగి వరి సాగు 4 లక్షల ఎకరాలు. వానకాలం సీజన్లో ప్రభుత్వం సన్నరకం వడ్లకు ఎంఎస్పీకి అదనంగా బోనస్ చెల్లించింది. బోనస్ ఆశతో యాసంగిలో అధికంగా సన్నరకం వరి పంటను సాగు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు చెరువులు, లిఫ్టు స్కీమ్ల కింద 2.38 లక్షల ఎకరాల్లో వరి పంట ఉండగా, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అక్కడ బాగుంది. కెనాల్ నిర్వహణ బాగుండడంతో అక్కడ పంటలకు డోకా లేదు. బోధన్ డివిజన్ ముందుగా వరి నాట్లు వేయడం వల్ల పంటలు కోతకు వచ్చాయి.
బోరుబావుల కింద సాగైన 1.80 లక్షల ఎకరాల వరి పంట గట్టెక్కడం కష్టమే. అఫిషియల్గా కరెంట్ బోర్ కనెక్షన్లు 96,321 ఉండగా, అన్అఫిషియల్ కనెక్షన్లు సుమారు 20 వేల దాకా ఉన్నాయి. డిసెంబర్ 2024లో 7 మీటర్ల లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్… భీంగల్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో15 మీటర్లకు పడిపోయింది. పంట దక్కించుకోడానికి రూ.లక్షలు ఖర్చు చేస్తూ 700 ఫీట్లలోతు బోరు తవ్వించినా బొట్టు నీరు రావడం లేదు. ఇప్పటికే సగం పంటలు ఎండడంతో రైతులు పశువుల మేతకు వదిలేశారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఎండిన వరి పంటలను పరిశీలించారు. ఎండిన పంటల వివరాల నివేదికను పంపించాలని అధికారులను ఆదేశించారు.
*_కామారెడ్డి జిల్లాలో’తడి కోసం తండ్లాట_*
కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్ లో 3. 97లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో అధికంగా 2. 65 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 2.10 లక్షల ఎకరాల్లో బోర్ల కిందనే సాగవుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో బోర్లు ఎక్కువ. ఫిబ్రవరిలో జిల్లా సగటు నీటి మట్టం 12.97 మీటర్లు ఉండగా.. మార్చిలో సగటు నీటి 10.68 మీటర్లుగా ఉంది. నెల రోజుల వ్యవధిలోనే 2.29 మీటర్ల కిందకు నీటి మట్టాలు తగ్గాయి. బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, రాజంపేట, నిజాంసాగర్ మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి.
రెండు మూడు బోర్లు వేయించినా ఫలితం లేదు. రైతులు సాధారణంగా 250 నుంచి 500 ఫీట్ల లోతు వరకు కొన్నిచోట్ల 600 ఫీట్ల వరకు బోర్లను వేసేవారు. 500 ఫీట్ల లోతు వరకు ఉన్న బోర్లలో కూడా కొన్ని ఏరియాల్లో నీటిమట్టాలు తగ్గుతుండటంతో ఇంకా అధిక లోతులో కొత్తగా బోర్లను వేస్తూ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు రైతులు 2, 3 బోర్లు వేయించినా కూడా ఫలితం లేదు. మాచారెడ్డి మండలం బంజేపల్లి, సోమారంపేట, మైసమ్మచెరువు తండా తదితర ఏరియాల్లో గత15 రోజుల్లోనే 600 ఫీట్ల నుంచి వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేయించినా చాలా వరకు ఫెయిల్ అయ్యాయి.
*_వెయ్యి ఫీట్ల లోతు వరకు తవ్వినా నీళ్లు పడలే.._*
రెండు ఎకరాల పొలం సాగు చేశా. గతంలో 800 ఫీట్ల లోతు బోరు ఉంది. గోధుమ, ఉల్లి పంటకు నీళ్లు అందట్లేదు. ఇది వరకే ఉన్న బోరును ఫ్లషింగ్ చేయించి ఇందులోనే వెయ్యి ఫీట్ల లోతు తవ్వించా. అయినా నీటి ధార రాలేదు. – గుగూలోత్ రాజ్య , కొత్తగూడెం తండా
*_పొట్ట దశలోని వరిని కాపాడుకునేందుకే.._*
రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. ఇది వరకే బోరు ఉండగా, మరో బోరు వేస్తే ఫేయిల్ అయ్యింది. వరి పొట్ట దశకు వచ్చింది. మరో బోర్ తవ్వించినా నీళ్లు రాలే.