కేసుల విచారణలో నాణ్యతే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి
– రైటర్లతో సమీక్షలో ఎస్పీ మార్గనిర్దేశం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, స్టేషన్ రైటర్లు, సీఐ, డీఎస్పీ ఆఫీస్ రైటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ రైటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు, విచారణ పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సి సి టి ఎన్ ఎస్ లో కేసులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవుతుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాక్షుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ప్రతి కేసులో ఎంతో ప్రభావం చూపుతాయని వివరించిన ఎస్పీ , తప్పుడు వాంగ్మూలాలు లేదా నేరస్థులకు అనుకూలంగా ఇచ్చే స్టేట్మెంట్లు కేసుకు భంగం కలిగిస్తాయని తెలిపారు. ఎఫ్ఐఆర్ నుంచి చార్జీషీట్ వరకు అన్ని వివరాలు సమగ్రంగా, స్పష్టంగా నమోదు చేయాలని, ఒక్క అంశంలో కూడా తప్పులు దొర్లకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి రైటర్‌కు ఉందని తెలిపారు. బాధితుడికి న్యాయం జరిగే విధంగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. బాధితునికి సమయానికి న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం పెరుగుతుంది. అదే పోలీస్ బాధ్యత, అని ఎస్పీ వివరించారు.ఈ సమావేశంలో డీసీఆర్బీ సీఐ మురళి , ఇతర పోలీస్ అధికారులు రైటర్లు పాల్గొన్నారు.