సిసిఐ ద్వారా పత్తికి మంచి గిట్టుబాటు ధర -హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సిసిఐ ద్వారా పత్తికి మంచి గిట్టుబాటు ధర-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లా 

పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంచి గిట్టుబాటు ధరను కల్పిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డి పల్లి పరిధిలోని శ్రీ హనుమాన్ కాటన్ ఇండస్ట్రీస్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వ్యవసాయ మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రక్రియను చేపట్టగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలుకు వచ్చిన, రానున్న పత్తి గురించిన వివరాలతో పాటు క్వింటాకు సీసీఐ అందిస్తున్న ధర, రైతుల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని, అమ్మిన పత్తికి ఏ విధంగా డబ్బులను చెల్లిస్తున్నారని, పత్తిలో తేమశాతం గురించిన వివరాలను సీసీఐతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పత్తి రైతుల వివరాలను నమోదు చేస్తున్న సీసీఐ డేటాను కలెక్టర్ పరిశీలించారు. మిల్లు ఆవరణలో ఉన్న పత్తితోపాటు కొనుగోలు అనంతరం తయారుచేసిన బేళ్లను కలెక్టర్ పరిశీలించారు. పలువురు పత్తి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు సంబంధించి నాలుగు జిన్నింగ్ మిల్లులున్నాయన్నారు. వాటిలో హనుమాన్ కాటన్ ఇండస్ట్రీస్ ఒకటని తెలిపారు. ఈ మిల్లు ద్వారా దాదాపు 665 మంది పత్తి రైతులు 12 వేల క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 24 వేల క్వింటాల పత్తిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. పత్తి విక్రయించిన రైతులకు సీసీఐ ద్వారా దాదాపు రూ. 20 కోట్లను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని మిగతా పత్తి రైతులు పండించిన తమ పత్తిని విక్రయించేందుకు తీసుకురావాలని, ప్రైవేటు కంటే సీసీఐ మంచి గిట్టుబాటు ధరను పత్తికి ఇస్తుందన్నారు. రైతులు సీసీఐ ద్వారా పత్తిని విక్రయించుకొని పేమెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కే. నారాయణ, సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment