పని ప్రదేశాల్లో వేధింపులా? – మహిళలూ ఫిర్యాదు చెయ్యండీ ‘షీ బాక్స్’ వెబ్‌సైట్‌లో
వేధిస్తే చెప్పొచ్చు – పని ప్రదేశంలో మహిళలకు అండగా ప్రత్యేక కమిటీలు
మహిళలూ పని ప్రదేశాల్లో ఎవరైనా వేధిస్తున్నారా? వికృత చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారా? బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారా? మీ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదా? ఇక మీకు ఆ బెంగ అవసరం లేదు. భద్రత కమిటీలు మీకు భరోసానిస్తాయి. ఫిర్యాదు చేసిన వెంటనే అండగా నిలుస్తాయి. ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పని ప్రదేశాల్లో ఉద్యోగినుల భద్రతకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మహిళలను లైంగికంగా వేధించినా ఇబ్బంది పెట్టినా చట్ట ప్రకారం శిక్ష పడేలా ఇవి పని చేస్తాయి. ఇప్పటివరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం వాటిని విధిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
షీ బాక్స్ : పని ప్రదేశాల్లో వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్(www.shebox.wcd.gov.in) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐసీడీఎస్ పీడీ విమల తెలియజేశారు. సంస్థలు దీనిలో కమిటీల వివరాలను కూడా నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను ఆయా ప్రాంతాల వారీగా ప్రతి నెలా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపడతారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. బాధితులు ముందుగా తమకు ఫిర్యాదుల వివరాలు అందించినా చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ విమల తెలిపారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ వికృత చేష్టలతో ఉద్యోగినుల్ని ఇబ్బంది పెట్టాడు. వాష్ రూంలో వీడియోలు తీసి వారిని బెదిరించేవాడు. ఓ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇటీవల పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
మందస మండలంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న మహిళతో తోటి ఉద్యోగి ఇటీవల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె ధైర్యంగా 181కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు
పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అంతర్గత భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారు కమిటీకి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తారు. అక్కడ న్యాయం జరగకుంటే జిల్లాస్థాయిలోని ఫిర్యాదుల కమిటీని సంప్రదించవచ్చు. ఆ సభ్యులు చర్చించి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుంటారు. కేసు తీవ్రతను బట్టి బాధ్యుల్ని బదిలీ చేయడం, విధుల నుంచి తొలగించడం, ఉద్యోగోన్నతి నిలుపుదల, అపరాధ రుసుం విధించడం వంటివి చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 254 కమిటీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.
ఎక్కడెక్కడ ఉండాలంటే : సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన అన్ని సంస్థలు, కార్యాలయాలు, కార్ఖానాలు, దుకాణాలు మహిళా సిబ్బంది ఉండే ప్రతి చోటా ఏర్పాటు చేయాలి. లేకుంటే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకునే హక్కు కలెక్టర్‌కు ఉంటుంది.
ఇష్టానికి విరుద్ధమైన ప్రవర్తనలన్నీ వేధింపులే : మహిళల ఇష్టానికి విరుద్ధమైన ప్రవర్తనలన్నీ వేధింపుల కిందకే వస్తాయి. అనవసరంగా తాకాలనుకోవడం, శారీరక సంబంధం కావాలని కోరడం, అసభ్యకరంగా మాటలు, చేష్టలు, ఇబ్బందికరంగా ప్రవర్తించడం, ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించడం చేయకూడదు.