డైవర్షన్‌ హైడ్రామా..మాజీ మంత్రి హరీశ్‌..

డైవర్షన్‌ హైడ్రామా..

IMG 20240826 WA0019

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై అక్రమ మైనింగ్‌ కేసులు పెట్టి రూ.300 కోట్ల జరిమానా విధించారు. ఆయనను నానా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోగానే మైనింగ్‌ కేసు అటకెక్కింది.రాజకీయ కక్షలకు విద్యాసంస్థలు, దవాఖానలను వాడుకోవద్దు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ మారనందుకే పల్లాపై పగబట్టారు. ఆయన భార్య, పిల్లలపైనా కేసులు పెట్టారు. హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు. ఆ పేరుతో జరుగుతున్న కక్ష సాధింపులకు వ్యతిరేకం.మాజీ మంత్రి హరీశ్‌రుణమాఫీ కోసం లక్షలమంది రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతూ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో జరుగుతున్న కక్ష సాధింపులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరలేదనే ఆయన విద్యాసంస్థలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.పల్లా కుటుంబంపై ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. పల్లా విద్యా సంస్థలకు రెవెన్యూ, నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, కలెక్టర్‌ అనుమతులు ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసమే ఈ ప్రభుత్వం సమయం కేటాయిస్తోందని విమర్శించారు. పల్లారాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడని, నిజాయితీగా పనిచేసిన నాయకుడని కితాబిచ్చారు. రేవంత్‌రెడ్డి కొందరిని టార్గెట్‌ చేసుకొని కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, లేదంటే ఆస్తులు కూల్చేస్తాం, కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. చీమకు కూడా హాని చేయని పల్లా కుటుంబంలో ఆయన భార్య, పిల్లలపైనా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైడ్రా పేరుతో డ్రామాలు..

ప్రత్యర్థులను మానసికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా కాలేజీలు ఒక్క అంగళం ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు చెప్పినా ఆయనే తొలగిస్తారని చెప్పారు. ఆయన మెడికల్‌ కాలేజీలో ఎంతోమంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన కాలేజీలపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్‌లో కానీ, బఫర్‌జోన్‌లో కానీ ఆయన కాలేజీలు లేవని రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ను ఆయన మీడియాకు చూపించారు. మెడికల్‌ కాలేజీ 813/పీ సర్వే నంబర్‌లో ఎలాంటి బఫర్‌ భూమి లేదని అప్పటి జిల్లా కలెక్టర్‌ రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హెచ్‌ఎండీఏ అనుమతితోనే భవనాలు నిర్మించారని, ఆ భూమిని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా 2018 ఏప్రిల్‌ 30న మార్పు చేశారని తెలిపారు. పల్లాపై జరుగుతున్నది రాజకీయ కుట్రేనని తేల్చి చెప్పారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజింగ్‌ సరికాదని హితవు పలికారు.

మండలి చైర్మన్‌కు డెంగ్యూ

విష జ్వరాలతో ప్రజలు బాధపడుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం చిమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యాలతో ప్రజలు వణికిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, శాసనమండలి చైర్మన్‌ కూడా చికున్‌గున్యా బారినపడ్డారని హరీశ్‌రావు తెలిపారు. డెంగ్యూ కేసులో ఈసారి 36 శాతం పెరిగాయని, 5,200 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో సాధారణ మందులు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక డ్రైవ్‌ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇంట్లోనే మూడు రోజులుగా చెత్త ఎత్తడం లేదని ఆమె చెప్పారని గుర్తు చేశారు.

రుణమాఫీపై కుంటిసాకులు

రుణమాఫీపై మంత్రులు కుంటిసాకులు చెప్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పొంగులేటి, ఉత్తమ్‌, తుమ్మల, భట్టి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎప్పటిలోగా రుణమాఫీ పూర్తిచేస్తారో చెప్పాలని నిలదీశారు. రుణమాఫీపై ఆర్మూరులో రైతులు స్వచ్ఛందంగానే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 72 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని, రూ. 30 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రూ. 10 వేల కోట్లు రైతు బీమాకు ఖర్చు చేశామని వివరించారు. రేవంత్‌రెడ్డి ద్వంద్వ ప్రమాణాలతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు నోటితో తిట్టడం తప్ప ఇచ్చిన మాట మీద నిలబడడం చేతకాదని విమర్శించారు. దేవుళ్లనే మోసం చేసిన ఆయనకు ప్రజలను మోసం చేయడం లెక్కకాదని పేర్కొన్నారు. రైతులకు ఇంకా రూ. 14 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నదని, దేవుళ్లకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.తాను విద్యా సంస్థలను ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతున్నదని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఏనాడూ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇంతగా ఇబ్బందులు పెట్టలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపైనా, తన కుటుంబంపైనా, తన విద్యాసంస్థలపైనా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెవెన్యూశాఖ, నీటిపారుదలశాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌, పోలీసులు ఇలా అన్ని వ్యవస్థలతో తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ కాలేజీ, యూనివర్సిటీ దేశంలోనే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ఐదో ర్యాంకులో నిలిచాయని గుర్తు చేశారు. తను కాలేజీ, యూనివర్సిటీకి అనుమతులు ఉన్నాయని, అంగుళం భూమిని కూడా అక్రమించలేదని స్పష్టం చేశారు. తన ముందు సర్వే చేసి అంగుళం భూమి బఫర్‌జోన్‌లో ఉన్నదని చెప్పినా కూల్చివేస్తానని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గట్టు రాంచందర్‌రావు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్‌ అప్పు రూ. 65 వేల కోట్లుఅప్పుల పేరు చెప్పి ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. 8 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 65 వేల కోట్ల అప్పు చేసిందని, అంటే నెలకు రూ.8,125 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం కింద రూ. 42,118 కోట్లు, వివిధ కార్పొరేషన్ల నుంచి 22,840 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ తన ఐదేండ్ల పాలనలో రూ. 4,87,500 కోట్ల అప్పు చేస్తుందని అంచనా వేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9 ఏండ్లలో రూ. 4,26,499 కోట్లు మాత్రమే అప్పు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కంటే, మిత్తిలకే ఎక్కువ మొత్తం అవుతుందని భట్టివిక్రమార్క అంటున్నారని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. పంచాయతీలు, మున్సిపాలిటిలకు పైసా నిధులు ఇవ్వడంలేదని, పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడి సెలవులు పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు.

Join WhatsApp

Join Now