మాటల్లో కోటలు… చేతల్లో కోతలు – కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీశ్ రావు విమర్శ

మాటల్లో కోటలు… చేతల్లో కోతలు

– కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీశ్ రావు విమర్శ

రాజకీయ ప్రయోజనాలు వదిలి ప్రజా ప్రయోజనాలపై కాంగ్రెస్ నాయకులు ద్రుష్టి పెట్టాలి.

సిద్దిపేటలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో మంజూరు అయిన పనులు రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

సిద్దిపేట ప్రజలపై ఎందుకు ఇంత వివక్ష.

సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపరు.

పనులు జరిగే వరుకు పోరాటం చేస్తా…

పనులు జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టె ప్రసక్తే లేదు..

నంగునూరు మండలం యువజన విభాగం నాయకుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

IMG 20250105 WA0066 scaled

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎగవేతలు, కోతలు తప్ప పాలనపై పట్టు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం నంగునూరు మండల బి ఆర్ ఎస్ యువజన విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏడాదిలో మాటల్లో కోటలు కట్టి… చేతల్లో ఎగవేతలు, కోతలు మిగిల్చింది అని చెప్పారు. బి అర్ ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను బంద్ చేసి, ఆరు గ్యారెంటీలను అటక ఎక్కించారని ఎద్దేవా చేసారు. బతుకమ్మ చీరలు, దళిత బందు, బిసి బందు, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్టు ఆపేశారు. వానాకాలం రైతు బందు వేయలేదు, చెరువుల్లో చేప పిల్లలను వేయడం బంద్ చేశారని అన్నారు. ఇలా సగం పథకాలు బంద్ చేసారు.. ఆరు గ్యారెంటీలని ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్నా రూ.2,500ల ఊసు లేదు, తులం బంగారం మాట లేదు.. రుణ మాఫీ సగం చేశారు.. రైతు భరోసా కొత్త నిబంధనలు పెట్టారు.. ఇలా మాటలు కోటలు… చేతల్లో కోతలు అని మండి పడ్డారు.

ఏడాదిలో అభివృద్ధిలో ఎడారి

పదేళ్లలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన సిద్దిపేట ఏడాది లో అభివృద్ధి ఏడారిగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారం లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ప్రజలపై కక్ష సాధిస్తున్నదని వాపోయారు. ప్రగతిలో పరుగులు పెట్టిన సిద్ధిపేటను.. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రగతి ఆవేదనగా మార్చి వేశారన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు అయిన పనులు రద్దు చేయడం, మధ్యలో పనులు ఆపడం.. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న కక్ష పూరిత చర్య అని,సిద్దిపేట ప్రజల పట్ల కక్ష సాధించడం ఎందుకు అని ప్రశ్నించారు. శిల్పారామం. రంగనాయక సాగర్ టూరిజం, ఆసుపత్రి, రోడ్లు ఇతర ఎన్నో పనులు అర్ధాంతరంగా నిలిపి వేశారని చెప్పారు. కొత్తవి మంజూరు ఇవ్వక పోగా పాతవి నిలిపి వేయడం ఎంత వరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదేనా మీ ఏడాది పాలన… ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన.. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. ఏడాది లో సిద్దిపేటకు ఒక్కటైనా మంచి పని చేశారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. రద్దు చేసిన పనులపై కాంగ్రెస్ నేతల వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు రాక.. పనులు కాక సిద్దిపేట అభివృద్ధి ఆగిపోవడం వంటి వాటి వల్ల ఈ ప్రాంత ప్రజలపై ఎందుకు ఇంత కక్ష అని, దీనిపై సిద్ధిపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సిద్ధిపేట ప్రజల కొరకు అభివృద్ధి పనులు జరిగే వరకు పోరాటం చేస్తామని, అభివృద్ధి కొనసాగించే వరకు, రద్దు చేసిన పనులు ప్రారంభం అయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమన్నారు.

యువతదే భవిష్యత్

ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ప్రజల్లో కి తీసుకెళ్లి బాధ్యత యువతదే అని హరీశ్ రావు అన్నారు.

భవిష్యత్ యువతదే, యువత రాజకీయాల్లో ముందు వరుసలో ఉండాలన్నారు. నంగునూరు మండలంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. నాల్గు వరుసల రహదారులు, విద్యా, వైద్యం అన్నింటి లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. యువకులకు సముచిత స్థానం ఇస్తామని, క్రియాశీలకంగా పార్టీలో పాల్గొనాలని కోరారు.

Join WhatsApp

Join Now