ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా జగన్‌తో సహా వైసీపిలో అందరూ సైలంట్ అయిపోయారు. అయితే ఓటమి వలన ఏర్పడిన నిశబ్ధం కాదు… ఇకపై చంద్రబాబు నాయుడు తమపై ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకుంటారో అనే భయం వలన కలిగిన నిశబ్ధం అని చెప్పొచ్చు. కానీ వారు ఊహించిన్నట్లుగా సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రతీకార చర్యలు చేపట్టలేదు. ముందుగా గాడి తప్పిన వ్యవస్థలను సరిచేసుకొని పాలనపై దృష్టి పెట్టారు. అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకోవడంపైనే దృష్టి పెట్టారు. వైసీపి నేతలపై టిడిపిలో ఎవరూ ప్రతీకారచర్యలకు పాల్పడవద్దని, తప్పు, అవినీతి చేసిన వారిపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందామని అందరికీ కట్టడి చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు తమని ఇంతగా ఉపేక్షిస్తారని ఊహించని జగన్, వైసీపి నేతలు కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇది జగన్‌కి, వైసీపికి చాలా అలుసుగా కనిపిస్తున్నట్లుంది అందుకే చాలా రెచ్చిపోతున్నారు.జగన్, తన సొంత మీడియా కలిసి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపి సానుభూతిపరులపై భౌతికదాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, ఎక్కడా ‘లా అండ్ ఆర్డర్’ లేకుండా పోయిందని జగన్ వాదిస్తున్నారు..