*_J&K Terror: చంపమని వేడుకున్నా.. పోయి మోడీకి చెప్పు అన్నారు..!!_*
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్ (Pahalgam Terror attack)లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మంజునాథ్ కూడా ఉన్నారు.
తన భార్య కళ్లెదుటే మంజునాథ్‌ను ముష్కరులు కిరాతకంగా కాల్చి చంపారు. కాగా.. కళ్లముందే భర్తను చంపుతున్న భయానక అనుభవాన్ని ప్రత్యక్ష సాక్షి అయిన మంజునాథ్ భార్య పల్లవి మీడియాకు వివరించారు. ‘ ట్రిప్ కోసం నా చిన్న కుమారుడిని తీసుకుని నేను, నాభర్త మంజునాథ్ బైసరన్ ప్రాంతానికి వచ్చాం. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేము పెహల్గామ్‌లో ఉన్నాము. ముగ్గురు, నలుగురు సాయుధులు మాపైన దాడి చేశారు. నా భర్తపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. నా భర్తను చంపేశారు.. నన్ను కూడా చంపేయండి అని వారిని అర్థించాను. నిన్ను చంపం. ఈ విషయాన్ని మోడీకి చెప్పు అని హేళన చేస్తూ ఆ దుండగుల్లోని ఒకరు అన్నాడు’ అని పల్లవి వివరించారు. మంజునాథ్ మామ మాధవ్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. “అతని కొడుకు 12వ తరగతి పరీక్షల్లో 98 శాతం మార్కులు సాధించాడు. అందుకే అతను తన కుటుంబాన్ని జమ్ముకశ్మీర్ కు తీసుకెళ్లాడు. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారు పానీపూరీ తింటున్నారు.” అని చెప్పుకొచ్చారు.
*_అమిత్ షా పరామర్శ_*
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడిన వారిని, బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.