సీఎంను, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి

 

తనను కావాలని భారాస ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు… భారాస ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్‌లో రికార్డు కాలేదని పేర్కొన్నారు. సీఎంను, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. ‘‘నేను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషలోవే… అవి ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెబుతున్నా. అధికారం కోల్పోవడం వల్ల భారాస నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వారు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారు. గత పదేళ్లుగా ఏనాడూ నా లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదు. భారాస ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించి తమ పద్ధతిని మార్చుకోవాలి’’ దానం నాగేందర్‌ తెలిపారు..

Join WhatsApp

Join Now