కామారెడ్డి జిల్లాలో నిర్జీవ స్థితిలో జన్మించిన శిశువుకు 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి, మార్గమధ్యంలోనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గాంధారి మండలం గొల్లాడి తండాకు చెందిన కేతావత్ సప్నకు కామారెడ్డి సర్వజన ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు నిర్జీవ స్థితిలో ఉండటంతో వైద్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ పృధ్విరాజ్ అత్యవసర చికిత్స అందించినప్పటికీ, శ్వాస ఇబ్బందులు అధికమవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు.
108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి, శిశువుకు ఆక్సిజన్ అందించారు. మార్గమధ్యంలో శిశువుకు ఫీట్స్ రావడంతో, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కృష్ణస్వామి శిశువు నోటిలోని నురగను సక్షన్ చేసి, అంబుబ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాసను అందించారు. ఈ సకాలంలో అందించిన చికిత్సతో శిశువు పరిస్థితి మెరుగుపడింది.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి శిశువును తరలించే సమయానికి, ఆమె నాడి, శ్వాస సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం, శిశువు తండ్రి కేతావత్ గణేష్ 108 సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. వారి సత్వర స్పందన, అందించి న చికిత్స వల్లే తమ బిడ్డ ప్రాణాలతో బయటపడిందని ఆయన పేర్కొన్నారు.


