ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ఆసుపత్రుల సేవల మెరుగుదలపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును పరిశీలించిన మంత్రి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అమరావతిలోని ఏపీ సచివాలయం 5వ బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందించే సేవల నాణ్యతను పెంచడంపై ప్రధానంగా చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, కార్యాచరణ ప్రణాళికలోని అంశాలపై అధికారుల నుంచి నివేదికలు స్వీకరించి, పురోగతిని సమీక్షించారు.
నివేదికల్లో మరింత స్పష్టత, కొలవదగిన పురోగతి ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక ఉద్దేశాలను సమగ్రంగా అమలు చేయాలని, పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలైన వీల్ చెయిర్లు, స్ట్రెచర్ల కొరతను భర్తీ చేయాలని, సైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు సీనియర్ డాక్టర్లు OP సేవల్లో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల పరిశుభ్రతను మెరుగుపరచాలని, ఆపరేషన్ థియేటర్లలో ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించడం, అవయవ మార్పిడి సేవలను త్వరితగతిన ప్రారంభించడం, ఆసుపత్రుల పనితీరును అంచనా వేసే ర్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని మంత్రి అధికారులను కోరారు. అందరూ సమన్వయంతో పనిచేయడం ద్వారా సేవల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.











