జిల్లాలో అమలు జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్య అధికారి డా. తుకారాం రాథోడ్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్ల లభ్యత, వడదెబ్బ నివారణ, గర్భిణీ స్త్రీల నమోదు, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, మలేరియా, టీబీ నివారణ చర్యలపై ఆయన అధికారులకు సూచనలు జారీ చేశారు.
వేసవి దృష్ట్యా, ప్రతి ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడి కేంద్రాలు, చలివేంద్రాలు మరియు జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారి డా. తుకారాం రాథోడ్ ఆదేశించారు. వడదెబ్బ బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లాకు నివేదించాలని సూచించారు.
గర్భిణీ స్త్రీల నమోదు, వ్యాధి నిరోధక టీకాల లక్ష్యాలను 100% సాధించాలని డా. రాథోడ్ స్పష్టం చేశారు. అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వాటి గుర్తింపునకు గ్రామాలలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని, వాటి నివేదికలను క్రమం తప్పకుండా జిల్లాకు సమర్పించాలని సూచించారు.
మలేరియా కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, 'ఫ్రైడే ఫ్రైడే' పాటించాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. క్షయ (టీబీ) కేసులను గ్రామాలలో గుర్తించి, వారికి తెమడ పరీక్షలు చేయించి, చికిత్స అందించాలని కూడా ఆదేశించారు. ఇప్పటివరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో 98% లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు తెలపగా, మిగిలిన 2% లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేసి 100% సాధించాలని వైద్యాధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో డా. శ్రీధర్ (డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, భద్రాచలం), డా. సాయి కళ్యాణ్ (డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, కొత్తగూడెం), ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ప్రసాద్, డా. ప్రతాప్, డా. హరీష్, డా. రాకేష్, డా. రాందాస్, డా. దినేష్ తో పాటు ఇతర వైద్యాధికారులు, ఎన్హెచ్ఎం సిబ్బంది పాల్గొన్నారు.











