సంగారెడ్డి జిల్లాలో 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి, సకాలంలో వైద్యం అందించే లక్ష్యంతో ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని RBSK-DEIC కేంద్రంలో ప్రారంభించారు.
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహించి, ఆరోగ్య సమస్యలు లేదా అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లలను గుర్తిస్తున్నారని తెలిపారు. రిస్క్‌లో ఉన్న పిల్లలను RBSK వైద్య అధికారుల వద్దకు తీసుకువచ్చి, స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
ప్రారంభ దశలోనే పిల్లల్లో సమస్యలను గుర్తిస్తే, వారిని త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రిస్క్‌లో ఉన్న చిన్నారులకు ఉచితంగా సర్జరీలు, ఫిజియోథెరపీ, రిఫెరల్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని లలిత కుమారి తెలిపారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం కీలకమని అన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే, రిస్క్‌లో ఉన్న పిల్లలకు DEIC కేంద్రాల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట ప్రాంతాల నుంచి 24 మంది రిస్క్‌లో ఉన్న చిన్నారులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నవీన్ చారి, డీసీపీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












