రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా, వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేసవి నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, ప్రజలను వడదెబ్బ బారిన పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ దవాఖానాలలో తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రులలో అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్లకు, వారి సహాయకులకు, సిబ్బందికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలని, వారికి అవసరమైన శిక్షణతో పాటు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే జనరేటర్లు పనిచేసేలా చూడాలని, అగ్ని ప్రమాదాల నివారణకు పాత వైరింగ్ మార్చడం, ఫైర్ అలార్మ్, స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేయడం, మంటలను ఆర్పే యంత్రాల నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, ఎండలో తిరిగేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని, 108కు సమాచారం అందించాలని కోరారు.







