పొగమంచు తీవ్రమైందిః అప్రమత్తంగా డ్రైవింగ్ చేయండి*
– నిజామాబాద్ కమిషనర్ సూచనలు
నిజామాబాద్, నవంబర్ 18 (ప్రశ్న ఆయుధం)
చలికాలంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ హెచ్చరించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులపై తరచూ ప్రమాదాలు నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నియమాలు తప్పక పాటించాలని ఆయన సూచించారు.
ద్విచక్ర వాహనదారుల కోసం సూచనలు
వేగం తగ్గించి, ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి.
హైబీమ్ వాడకూడదు; లోబీమ్ లైట్లు మాత్రమే వినియోగించాలి.
సడెన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి.
అవసరమైన సమయంలో ఇండికేటర్లు తప్పనిసరిగా వాడాలి.
మలుపులు తీసేటప్పుడు జాగ్రత్తగా, సూచికలతో వాహనం మలపాలి.
రోడ్డు తడిగా ఉన్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉండటంతో వేగాన్ని మరింత తగ్గించాలి.
హెల్మెట్ వినియోగం ఖచ్చితంగా పాటించాలి.
వాహనంలో రెండు వైపులా రియర్ వ్యూ మిర్రర్లు ఉండాలి.
రాత్రి, తెల్లవారుజామున పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదు.
ఫోర్‌వీలర్, భారీ వాహనదారుల కోసం సూచనలు
వాహనాన్ని నెమ్మదిగా నడిపి వేగ నియంత్రణలో ఉంచాలి.
ముందున్న వాహనానికి కనీసం 50–100 అడుగుల దూరం పాటించాలి.
లోబీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి.
విండోలను కొద్దిగా తెరిచి ఉంచితే గ్లాస్ ఫాగింగ్ తగ్గుతుంది.
లైన్ మార్కింగ్‌లు, డిఫ్లెక్టర్లు గమనిస్తూ వాహనం నడపాలి.
లైట్లు, బ్రేకులు, టైర్లు వంటి వాహనం కండిషన్‌ను నిరంతరంగా చెక్ చేయాలి.
పొగమంచు లేదా మూలమలుపుల వద్ద ఓవర్‌టేక్ చేయరాదు.
సడెన్ బ్రేకులు వేయకుండా ఉండాలి.
వాహనాలకు రేడియం స్టిక్కర్లు అమర్చుకోవడం అవసరం.
వాహనం చెడిపోతే రోడ్డుకు ఎడమ వైపుకు తీసుకెళ్లి ఇండికేటర్లు ఆన్ చేసి హెచ్చరిక గుర్తులు పెట్టాలి.
రిపేర్ అయిన తర్వాత అక్కడ ఉంచిన రాళ్లు, కొమ్మలు వంటి గుర్తులను తొలగించాలి.
రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం.
పొగమంచు తీవ్రత కారణంగా ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి వాహనదారుడు జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సూచనలు అందరూ అమలు చేయాలని కమిషనర్ సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.