*Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు ‼️*
– అల్పపీడనం, రుతుపవనాలు
– మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు
హైదరాబాద్ ; తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే నెల తొలి వారంలో రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవనాలు, అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది.
కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ అయింది. బుధవారం రాత్రి మూడు గంటల పాటు దంచి కొట్టింది. కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అనేక చోట్ల అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. పలు చోట్ల విద్యుత్తు సౌకర్యం లేక అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్థంభాలు కూడా నేలకొరిగాయి. ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 నిమిషాల వ్యవధిలో సర్కిల్7 లోని బండ్లగూడలో 87.3 మి.మీ., అస్మాన్‌ఘడ్‌లో 82.5, మలక్‌పేటలో 82.3, సరూర్‌నగర్‌లో 77.8, ముసారాంబాగ్‌లో 75.8, ఎల్బీనగర్‌లో 69.0, చంపాపేటలో 66.3, హిమాయత్‌నగర్‌లో 61.0 మి.మీ. వర్షం పడింది. చాదర్‌ఘాట్ ఆర్‌యూబీ కింద వరద ప్రవహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నేడు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడూ సమీక్షలు జరుపుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లపై నీరు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.