తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..!!
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
రెండ్రోజుల్లో వాయుగుండంగా మారే చాన్స్
హైదరాబాద్ : మన రాష్ట్రంతో పాటు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకున్నాయి.
మంగళవారంతో నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి వెళ్లిపోవడంతో నైరుతి రుతుపవనాల కాలం పూర్తయిపోయింది. దీంతో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వెంటనే మొదలైపోయింది. దేశంలోని పలు చోట్ల వాటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడగా.. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతున్నదని తెలిపింది. వాటి ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి టైంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా, మంగళవారం హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా ధవళాపూర్లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్కర్నూల్ జిల్లా ఎల్లికల్లో 2.8, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 2.7, యాదాద్రి జిల్లా జంగంలో 2.5, జనగామ జిల్లా గూడూరులో 2.5, వికారాబాద్ జిల్లా కాశీంపూర్లో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో మంగళవారం ఉదయం సడన్గా వర్షం కురిసింది. మెట్టుగూడలో 2.2 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 2, మల్కాజిగిరి, ఉప్పల్లో 1.7, సికింద్రాబాద్, ఖైరతాబాద్లో 1.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.