జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక – కలెక్టర్ అప్రమత్తం
సెప్టెంబర్ 2 నుంచి భారీ వర్షాల అవకాశం
అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించాలని ఆదేశం
ముంపు ప్రాంతాలు, పాత ఇండ్లు, ప్రమాదకర విద్యుత్ స్తంభాలు గుర్తించాలి
చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సహకరించాలని విజ్ఞప్తి
ప్రశ్న ఆయుధం, ఆగస్టు 31
జిల్లాలో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వర్షాల కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నందున, కొత్తగా భారీ వర్షపాతం కురిసే పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గ్రామాల నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు, తడిచిన పాత ఇండ్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు.అదేవిధంగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో తెలియజేయాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుని, అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.