ఆంక్షలతో భక్తులకు నరకం
42 కి.మీ.గా మారిన 32 కి.మీ. గిరి ప్రదక్షిణ
అదనపు దూరం, ప్రత్యామ్నాయ రవాణా లేక భక్తుల ఆగ్రహం
సింహాచలం: 32 కిలోమీటర్ల సింహాచలం గిరి ప్రదక్షిణ..
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా దాదాపు 42 కిలోమీటర్లకు చేరిందని భక్తులు వాపోయారు. ప్రదక్షిణకు ముందు, ఆ తర్వాత కూడా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడంతో నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా అమలు చేసిన కఠిన నిబంధనలు.. భక్తుల సహనాన్ని పరీక్షించాయి.
గిరి ప్రదక్షిణ ప్రారంభించేందుకు బుధవారం సింహాచలం చేరుకున్న భక్తులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వాహనాలను వేపగుంట, గోపాలపట్నం కూడళ్ల వద్ద అంటే కొండకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. దీంతో అసలు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మొదలుపెట్టక ముందే తొలిపావంచాకు చేరుకోవడానికే భక్తులు సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. రాత్రంతా 32 కిలోమీటర్లు నడిచి.. గురువారం ఉదయానికి తొలిపావంచాకు చేరుకున్న భక్తులకు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుగు ప్రయాణంలోనైనా తొలిపావంచా నుంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని భావించిన భక్తులకు నిరాశే ఎదురైంది. తమ వాహనాల వద్దకు చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో.. తీవ్రమైన అలసట, భగభగమండే ఎండలో విలవిలలాడుతూనే తిరిగి గోపాలపట్నం, వేపగుంట వరకు నడిచారు. ఈ స్వల్ప దూరం నడవడానికి కొందరికి రెండు మూడు గంటల సమయం పట్టింది. అంటే అసలు గిరి ప్రదక్షిణ మార్గం 32 కిలోమీటర్లు అయితే.. ట్రాఫిక్ ఆంక్షల వల్ల భక్తులు అదనంగా మరో 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ‘పుణ్య యాత్రకు వస్తే అధికారులు మాకు నరకం చూపించారు. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ కాస్తా 42 కిలోమీటర్లుగా మారింది’ అని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు గిరి ప్రదక్షిణకు వచ్చే, వెళ్లే భక్తులతో గోశాల జంక్షన్ కిక్కిరిసిపోయి, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మొత్తంమీద ఈ ఏడాది పోలీసులు గిరి ప్రదక్షిణ భక్తులకు చుక్కలు చూపించారు.
ప్రత్యామ్నాయం చూపాలి
నేను గిరి ప్రదక్షిణ చేయడానికి బుధవారం మాధవధార నుంచి వచ్చాను. వేపగుంటలో మేము వచ్చిన వాహనం నిలిపివేయడంతో అక్కడి నుంచి తొలి పావంచాకి దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచాను. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరిగి పయనం అవుదామంటే తొలి పావంచా నుంచి ఎలాంటి రవాణా సదుపాయం కల్పించ లేదు. వాహనాల వద్దకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డాం. వచ్చే ఏడాదైనా అధికారులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. – లక్ష్మి, మాధవధార
రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడ్డా..
నేను అచ్యుతాపురం నుంచి బుధవారం గిరి ప్రదక్షిణకు వచ్చా. వేపగుంటలో ఆటో ఆపేశారు. అక్కడి నుంచి సింహాచలం వరకు నడిచా. ఇప్పుడు ప్రదక్షిణ పూర్తి చేసి మళ్లీ వేపగుంట వరకు నడవాల్సి వస్తోంది. ఎలాంటి రవాణా సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.
– గంటాలమ్మ, అచ్యుతాపురం
వచ్చే ఏడాదైనా చర్యలు చేపట్టాలి
గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని తొలిపావంచా నుంచి ఇంటికి వెళ్దామంటే రవాణా సదుపాయం అందుబాటులో లేదు. బుధవారం సింహాచలం చేరుకునేందుకు వేపగుంట నుంచి నడిచాను. తిరిగి వెళ్లేటప్పుడు కూడా నడవాల్సి వస్తోంది. తిరుగుపయనం అయ్యే భక్తుల కోసం వాహన సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. వచ్చే ఏడాదైనా తగిన చర్యలు చేపట్టాలి.
– భారతి, కంచరపాలెం
ఆంక్షలతో భక్తులకు నరకం
ఆంక్షలతో భక్తులకు నరకం
ఆంక్షలతో భక్తులకు నరకం