*విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఉన్నత సంస్కరణలు*
– కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక పునరుద్ధరణకు చర్యలు
– ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి
– సమాజంలో మహిళలను గౌరవించే పరిస్థితి ఉన్నప్పుడే
మహిళలకు రక్షణ ఉంటుంది
– పాఠశాల విద్యలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నాం
– రాజకీయాలను ప్రభుత్వ విద్యకు దూరంగా పెట్టాం
– విద్యార్థులు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
– బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి
– జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్ స్థాయికి ఎదగాలి
– రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్
– ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి
– విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
శనివారం విజయవాడ, పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలోనే మూడో అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలుపొందానని.. జీవితం అనేది ఓ పరీక్ష వంటివదని, ఆ పరీక్షని జయించే శక్తిని కూడా దేవుడు ఇస్తాడని పేర్కొన్నారు. జీవితాన్ని ఓ పరీక్షగా భావించి శ్రమించి ఉన్నత విజయాలు అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మొదట పాఠశాల విద్యా విభాగంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఇందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని.. ఇందులో భాగంగా తొలిగా రాజకీయాలను ప్రభుత్వ విద్యకు దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి పిల్లలు వెళ్లేవారని.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి ముగింపు పలికి ఎవరూ ఎక్కడకూ వెళ్లనవసరం లేకుండా చదువుపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాబ్ మేళాలు మినహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులుపడ్డారని.. వారిపై యాప్‌ల భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మార్పు కార్యక్రమాన్ని ప్రారంభించాం. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ సమాజంలో మహిళలను గౌరవించే పరిస్థితి ఉన్నప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. ఈ అంశంపైనా దృష్టిసారించి కరిక్యులంలో వివిధ అంశాలను పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇలా అనేక సంస్కరణలు దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
*ఇంటర్మీడియెట్ భావి జీవితానికి ప్రధాన వంతెన:*
జీవితంలో ఇంటర్మీడియెట్ దశ చాలా ముఖ్యమైందని.. మన జూనియర్ కళాశాలల్లోని పిల్లల్లో విద్య పరంగా ఇబ్బందిపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకు అందజేసి ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశామని.. వచ్చే ఏడాది నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ తదితరాలను అందించనున్నట్లు మంత్రివర్యులు తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటుకు దీటుగా విద్యా వ్యవస్థ సమగ్ర అభివృద్దికి కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. బాగా చదవడంతోపాటు స్నేహ మాధుర్యాన్నీ అనుభవించాలన్నారు. విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం, అకడమిక్ పురోగతి ఇలా ప్రతి విషయంపైనా దృష్టిసారించి.. కళాశాలల ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దార్శనికతతో స్వర్ణాంధ్ర @ 2047ను తీసుకొచ్చినట్టు తెలిపారు. అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చాం, తీసుకొస్తున్నామన్నారు. టీసీఎస్ విశాఖకు వస్తోందని, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకుకొస్తున్నాయన్నారు. పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చి, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని.. కొత్త ఆలోచనలతో పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కేవలం జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీతో అనేక రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాయన్నారు.
*డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం చేస్తోంది:*
గత ప్రభుత్వం డ్రగ్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదని మంత్రివర్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రత్యేక ఈగల్ టాస్క్‌ఫోర్స్ పెట్టామని వివరించారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని.. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి వల్ల కుటుంబాలే నాశనమవుతాయన్నారు. త్వరలోనే ఇంటర్మీడియెట్ పరీక్షలు వస్తున్నాయని.. వీటిపై దృష్టిపెట్టి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. ఐఐటీ మద్రాస్‌తో పైలట్ ప్రాజెక్టును చేపట్టామని.. నిపుణులతో సాయంత్రం సమయంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టు నిపుణులతో విద్యార్థులకు నైపుణ్యాలు అందించడంపై దృష్టిసారిస్తున్నామని.. తదుపరి బ్యాచ్‌కు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిపారు. మోడల్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నామని.. అందరూ సమష్టిగా కృషిచేసి ఇంటర్మీడియెట్ కళాశాలల అభివృద్ధికి కృషిచేద్దామన్నారు. పాయకాపురం జూనియర్ కళాశాల మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించండి.. కళాశాల మౌలిక వసతుల అభివృద్ధి బాధ్యత తాము తీసుకుంటామని మంత్రివర్యులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు విద్యార్థులతో ముచ్చటించారు.
ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), శాసనససభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులతో భోజనం చేశారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ డా. కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మిశ, సీపీ ఎస్వీ రాజశేఖర బాబు తదితరులు పాల్గొన్నారు.