*ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*
*అయన సేవలు మరువలేనివి..*
*మున్సిపల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావు కమీషనర్ మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మెన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ లు హాజరై వారు మాట్లాడుతూ తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ, మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించినా ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తి అని వారు అన్నారు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచిన వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే పురుడు పోసుకుందని, తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారన్నారు. 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేసిన వ్యక్తి అని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా సేవలందించారు. 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారని, 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారన్నారు. ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ లో చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రికి బదులుగా గవర్నర్ పదవి ఇస్తానని ఇందిరాగాంధీ ముందుకు వచ్చినా, ఆ ప్రతిపాదనను తిరస్కరించారని వారు అన్నారు. ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని, అయన చూపిన బాటలో నేటి యువత నడవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ G రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వాణి, కౌన్సిలర్లు రావికంటి రాజు, దయ్యల శ్రీనివాస్, భోగం సుగుణ, పొనగంటి విజయలక్ష్మి మల్లయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.