ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణపై హెచ్‌ఎండీఏ సమీక్ష
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 21
సికింద్రాబాద్ నుండి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం చేపట్టిన భూసేకరణ పురోగతిపై హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రోపాలిటన్ హైదరాబాద్, మేడ్చల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఆర్‌అండ్‌ఆర్ పాలసీ ప్రకారం తగిన పరిహారం అందించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ గృహాలు కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. అల్వాల్‌లోని సత్యా అపార్ట్‌మెంట్‌కు కలిగే నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
శామీర్‌పేట్ భూసేకరణ పరిధిలో ఉన్న సాయిబాబా గుడి స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని కేటాయించి, కొత్త గుడి నిర్మాణానికి గ్రామస్తులను ఒప్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన స్థలాలను గుర్తించి వివరాలు అందించాలని కోరారు.
భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్డీసీ డిప్యూటీ కలెక్టర్ మాలతి, అల్వాల్, శామీర్‌పేట్ మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.