ఆశ కార్యకర్తల నియామకాలపై ఆరోపణల హల్ చల్

  • ఆశ కార్యకర్తల నియామకాలపై ఆరోపణల హల్ చల్
  • కోఆర్డినేటర్లను నిబంధనల ప్రకారం నియమించాలి 
  •  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 11 ( ప్రశ్నఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు 

పార్వతీపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా త్వరలో చేపట్టనున్న నియామకాల్లో పారదర్శకత కనిపించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతిపురం జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావును కలిసి ఆ శాఖ ద్వారా చేపడుతున్న నియామకాల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చేపట్టిన నియామకాల్లో పలు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి నియామకాల్లో పారదర్శకత పాటించాలన్నారు. ఈసారి గతంలో లాగా నియామకాల్లో ఆరోపణలు రాకూడదని, నియామకాలు రద్దు చేసే దుస్థితి అస్సలు రాకూడదన్నారు. ఎప్పటికే ఆశా కార్యకర్తల నియామకాలకు సంబంధించి గ్రామాల్లో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దళారులు రంగ ప్రవేశం చేసి ఆశా కార్యకర్తల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షలు వరకు బేర సారాలు ఆడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్కడక్కడ వసూళ్లు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆయా ఆరోపణల్లో వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు లేకుండా శాఖాపరమైన హెచ్చరికలు జారీ చేయాలన్నారు. నిబంధనలు ప్రకారమే ఆశ కార్యకర్తలను నియమించాలన్నారు. కమిటీల ద్వారా నియామకం అనేది జరిగితే గ్రామాల్లో రాజకీయ బలం ఉన్న వాళ్లకే దక్కే అవకాశం ఉందన్నారు. మెరిట్ కి అవకాశం దక్కకపోవచ్చు అన్నారు. కాబట్టి పారదర్శకంగా నియామకాలు జరిగేలా చూడాలన్నారు. వాటితోపాటు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా పిపిఎం కోఆర్డినేటర్, సీనియర్ టిబి హెచ్ఐవి సూపర్వైజర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు నియమ నిబంధనలు ప్రకారం చేపట్టాలన్నారు. సిఫార్సు లేఖలకు తలొగ్గొద్దన్నారు. గతంలో కార్యాలయంలో నియామకాల ఆరోపణలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు.

పారదర్శకంగా నియామకాలు

ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు మాట్లాడుతూ నియామకాలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఎటువంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now