యుపిలో నరబలి..రెండవతరగతిబాలుడి హత్య
ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో ఘోరం జరిగింది. క్షుద్ర పూజల పేరుతో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడ్ని పాఠశాల ఉపాధ్యాయులే వారం క్రితం దారుణంగా హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని బలి ఇస్తే పాఠశాల మంచి విజయాలు సాధిస్తుందన్న మూఢ విశ్వాసంతో ఉపాధ్యాయులే ఈ ఘాతుకానికి ఒడిగట్టడం దారుణం. బాధిత విద్యార్థి తండి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల యజమాని జసోదన్ సింగ్, ఆయన కుమారుడు దినేష్ బఘేల్‌తో బాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడేళ్ల కృతార్ఘ్ హత్రాస్‌లోని రంగవాన్‌లోని డిఎల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. గత వారం తన కొడుకు ఆరోగ్యం బాగులేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. తండ్రి అక్కడికి వెళ్లగా బాలుడ్ని పాఠశాల డైరక్టర్ తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ వద్ద ఆయన వేచిఉన్నాడు. కాసేపటికే మీ కొడుకు చనిపోయాడంటూ కారులో ఉన్న ఆ బాలుడి మృతదేహాన్ని అతనికి స్కూల్ యజ మాని కుమారుడు బఘేల్ అప్పగించాడు. ఆ బాలుడ్ని స్కూల్ దగ్గర ఉన్న గొట్టపు బావి దగ్గర మొదట చంపాలని భావించారు. కానీ, హాస్టల్ నుండి బయటకు తీసుకొస్తున్న సమయంలో బాలుడు అరవడంతో అక్కడే అతని గొంతునులిమి చంపేశారు. స్కూల్ యజమాని క్షద్రపూజలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు.