నేను సేవకుడినే : ఛైర్మన్ 

*తిరుమల, 2025, ఫిబ్రవరి 05*

శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లే : టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు

నేను సేవకుడినే : ఛైర్మన్

తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనము – 2 భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, సేవ చేసే అవకాశం వచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఎదైనా ఇబ్బందులు ఎదురైవుంటే మరచిపోయి సంతోషంగా సొంత గ్రామాలకు చేరుకోవాలని కోరారు. ఏడాదికి మూడు నాలుగు సార్లు తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిన రోజులు ఉన్నాయని, స్వామి వారి అనుగ్రహంతో టిటిడి ఛైర్మన్ గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

టిటిడి ఛైర్మన్ గా పదవి వచ్చినా తాను ఒక సేవకుడినేనని సేవకుల ముందు మాట్లాడారు. రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలు అందించిన వారి ముందు మాట్లాడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనంద భాష్పాలతో మాట్లాడారు.

శ్రీవారి సేవ చేసే అవకాశం మరింత మందికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు డిప్ సిస్టమ్ బటన్ నొక్కి ఆన్ లైన్ లో 520 మందికి సేవ చేసేలా ఆటోమేటిక్ అలాట్మెంట్ చేశారు.

శ్రీవారి సేవా సదన్ లో సమావేశం ముగిశాక టిటిడి ఛైర్మన్ ను ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డా.టి.రవి శాలువాతో సన్మానించి, శ్రీవారి మొమెంటోను అందజేశారు. అంతకు ముందు శ్రీవారి సేవా సదన్ ప్రారంభం నుంచి నేటి వరకు శ్రీవారి సేవ పురోగతిని ఛైర్మన్ కు సీపీఆర్వో నివేదించారు.

టిటిడి ఛైర్మన్ మాట్లాడటానికి ముందు రథసప్తమి రోజున భక్తులకు అందించిన సేవలను బెంగుళూరు, సిద్దిపేట, నల్గొండ, ప్రకాశం, లండన్ నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఛైర్మన్ కు వివరించారు.

బెంగళూరు నుండి వచ్చిన భక్తుడు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం మహాభాగ్యం అని తెలిపారు. చక్రస్నానం చూడాలని ఎన్నో రోజుల కల అని ఈ అవకాశం రథసప్తమి రోజున వచ్చిందన్నారు.

సిద్దిపేట నుంచి వచ్చిన సౌమ్య మాట్లాడుతూ, శ్రీవారి సేవ సందర్భంగా ఇక్కడ నేర్చుకున్న భక్తి, ఓర్పు, సేవను సొంత ఇంటికో, గ్రామానికో అన్వయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెర ముందు, వెనుక ఎందరో కృషి మూలంగా రథసప్తమి రోజున భక్తులకు ధైర్యంగా సేవలు అందించామన్నారు. లండన్ నుంచి వచ్చిన సేవకురాలు రీటా మాట్లాడుతూ, చివరి భక్తుడి వరకు స్వామి వారి దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు అందించడం, పరిశుభ్రంగా టిటిడిలో చూశానన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment