జిల్లాలో నర్సిపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా..! 

జిల్లాలో నర్సిపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా!

 

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర.

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూలై 28( ప్రశ్నఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం : నర్సిపురం గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, దానికి ప్రజల సహకారం పూర్తిగా కావాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఆదివారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నర్సిపురం గ్రామంలో ఉత్సాహంగా సాగింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు గ్రామంలో వీధి వీధినా తిరిగిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు గురించి అడిగి తెలుసుకున్నారు.అలాగే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ప్రజల నుండి ఆరా తీశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సిపురం గ్రామంలో స్మశాన వాటిక సమస్య ఉందని, ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్నందున వెంటనే ఎస్సీలు, ఎస్టీలకు వేరువేరుగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉండిపోయిన కళ్యాణమండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ప్రజల అవసరాలన్నీ గుర్తించి వాటిని నెరవేర్చే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. గ్రామంలోని రెవెన్యూ, రెవెన్యూయేతర సమస్యల వివరాలను తనకు వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామంలో ఎక్కడ విద్యుత్ సమస్య లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ప్రజలతోనే, ప్రజల కోసమే తాను ఎల్లప్పుడూ పని చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలపై నర్సిపురం ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now