కేసీఆర్ అలా చేయకపోయి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేది: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

*కేసీఆర్ అలా చేయకపోయి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేది: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు*

జగన్‌కు కేసీఆర్ పంచభక్ష పరమాన్నం పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శ

తెలంగాణ జల దోపిడీకి అక్కడే అంకురార్పణ జరిగందన్న ముఖ్యమంత్రి

కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే పంచాయితీ ఉండకపోయేదన్న రేవంత్ రెడ్డి

కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో జగన్‌ను అధికార లాంఛనాలతో ఆహ్వానించి, పంచభక్ష పరమాన్నం పెట్టారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ జల దోపిడీకి అక్కడే అంకురార్పణ జరిగిందని ఆరోపించారు. “ఈ పాపం మీది కాదా కేసీఆర్” అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా అన్నారు.

నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ వేల కోట్ల రూపాయలు మింగారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టు కడితే అది కూలిపోయిందని మండిపడ్డారు. లగచర్లలో గొడవ పెట్టాలని చూశారని, కలెక్టర్‌ను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. మా పాలమూరు ప్రాంతానికి పరిశ్రమలు రావొద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

గట్టిగా కొడతానని కేసీఆర్ ఇటీవల అంటున్నారని, కొట్టడానికి అదేమైనా ఫుల్లా? హాఫా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొట్టాల్సింది తనను కాదని, తప్పు చేస్తున్న ఆయన కొడుకు, అల్లుడిని కొట్టాలని వ్యాఖ్యానించారు. గట్టిగా కొడితే తమ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల బిక్షే అన్నారు.

*ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో దోపిడీకి పాల్పడ్డారు*

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీకి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోటే ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, అందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్రూంలు ఉన్న చోట బీఆర్ఎస్ అడగడానికి సిద్ధమా? అని సవాల్ చేశారు. పాలమూరు పేదరికాన్ని చూపించి కేసీఆర్ మార్కెటింగ్ చేసుకున్నారని ఆరోపించారు. తనపై కోపంతో కేసీఆర్ పాలమూరుపై కక్ష కట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులపై తాను దృష్టి సారించానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేదని, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు, అదో పార్టీయా అని ఎద్దేవా చేశారు.

*మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే పంచాయితీ పెట్టాలని చూస్తున్నారు*

మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే కొంతమంది పంచాయితీ పెట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. పాలమూరుకు ముఖ్యమంత్రి రూపంలో ఒక అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. మన ఇంటి బిడ్డకు అవకాశమొస్తే కడుపులో కత్తులు పెట్టి చంపాలని చూస్తున్నారని విమర్శించారు.

అలాంటి వారికి పాలమూరు యువత బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పనులు చేసే బాధ్యత తనదని, తనను కాపాడుకునే బాధ్యత మాత్రం పాలమూరు ప్రజలదే అన్నారు. మనకు మళ్లీ ఇలాంటి అవకాశం రాదని ఆయన అన్నారు. మనకు అవకాశం వచ్చినప్పుడే ప్రాజెక్టులు పూర్తి చేసుకుందామని అన్నారు. కొడంగల్‌లో ప్రాజెక్టులు తెచ్చి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.

*భూసేకరణను అడ్డుకోవద్దని విజ్ఞప్తి*

పాలమూరు ప్రజలు భూసేకరణను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇస్తామని అన్నారు. ఇక్కడ మీ బిడ్డ, మీ సోదరుడు ఉన్నాడని, కాబట్టి పరిహారం తప్పకుండా ఇస్తామన్నారు. నష్టపరిహారం ఇచ్చి, ఉద్దండపూర్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రజల కష్టాలను తీర్చకుంటే మీ బిడ్డ అధికారంలో ఉండి ఏం లాభమని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment