Site icon PRASHNA AYUDHAM

మతం దాచి పెళ్లి చేసుకుంటే ఇకపై చెల్లదు

IMG 20250808 WA0637

మతం దాచి పెళ్లి చేసుకుంటే ఇకపై చెల్లదు- 10ఏళ్ల జైలు శిక్ష…ప్రభుత్వం కీలక నిర్ణయం

మత మార్పిడిలపై హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు హరియాణా చట్టవ్యతిరేక మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022ను పాటించాలని జిల్లా కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం మతాన్ని దాచి చేసుకున్న పెళ్లి చెల్లదు. ఇంకా చట్టరీత్యా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వివాహం కోసం జరిగే మతమార్పిడిని ఈ చట్టం నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే జరిమానాతో పాటు శిక్షలు విధిస్తారు. అవేంటంటే

చట్ట వ్యతిరేక మత మార్పిడి 1-5 ఏళ్ల జైలు శిక్ష, సుమారు రూ. లక్ష జరిమానా

• మతాన్ని దాచిపెట్టి వివాహం 3-10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా, వివాహం చట్టరీత్యా చెల్లదు.

• ఎస్సీ, ఎస్టీకి చెందిన మైనర్ లేదా ఇతర వ్యక్తులను మతం మారిస్తే 4-10 ఏళ్ల జైలు శిక్ష, సుమారు రూ.3 లక్షల జరిమానా

• సామూహిక మత మార్పిడి (ఇద్దరికి మించితే) 5-10ఏళ్ల జైలుశిక్ష, సుమారు రూ.4 లక్షల జరిమానా

• చట్ట వ్యతిరేక మత మార్పిడి ద్వారా జన్మించే శిశువును చట్టబద్ధంగానే పరిగణిస్తారు. అయితే, పిల్లల వారసత్వ హక్కులు మాత్రం మతం ఆధారంగా కాకుండా సాధారణ వారసత్వ హక్కులు వర్తిస్తాయి.

చట్టం ప్రకారం మత మార్పిడి ఎలా?

మతం మారాలని భావిస్తున్న వ్యక్తి మొదటగా డిప్యూటీ కమిషనర్ ఎదుట సంబంధిత డిక్లరేషన్ ఫారమ్ను నింపాలి. ఒకవేళ మతం మారే వ్యక్తి మైనర్ అయితే, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఫారమ్ బీ నింపాలి. మత పెద్దలు, నిర్వాహకుల సమక్షంలో మార్పిడి జరుగుతుంటే అందుకు సంబంధించిన వివరాలను ముందుగానే ఫారమ్ సీ ద్వారా అందించాలి. ఆ తర్వాత వీటిని పరిశీలించి డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేస్తారు.

మత మార్పిడిని ఎలా ఆపాలి?

నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైనా 30 రోజుల లోపు డిప్యూటీ కమిషనర్కు అభ్యంతరాలు తెలపాలి. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తారు. మత మార్పిడి బలవంతంగా, మోసపూరితంగా జరిగినట్లు తేలితే దీనిని రద్దు చేస్తారు. అయితే, ఎవరి మత స్వేచ్ఛను అడ్డుకోమని ప్రభుత్వ ఉద్దేశం కాదని, దీని పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమేనని తెలిపింది…

Exit mobile version