అదే జరిగితే చంద్రబాబుకు మొదట ఎదురుతిరిగేది నేనే.. బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదు చేయటంతో పాటుగా.. పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న దీనిపై స్పందించారు. గత వైసీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల గురించి అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందేనని.. శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు పోసాని కృష్ణమురళి కూడా చంద్రబాబు, నారా లోకేష్ గురించి ఇష్టానుసారం మాట్లాడారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. కొంతమంది ఇప్పుడు తప్పైందని, రాజకీయాలు వదిలేస్తున్నామని చెప్తున్నారన్న బుద్ధా వెంకన్న.. రాజకీయాలు వదిలేసినా వారిని మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు.
“వీళ్లంతా కూడా మేక వన్నె పులులు. కొడాలి నాని, వల్లభనేని వంశీ పేరుకే పులులు. నిజంగా పులులు అయితే బయటకు రండి. పిల్లులు అయితే దాక్కొండి. చంద్రబాబును, భువనేశ్వరిని విమర్శించిన వారి రికార్డు అంతా మా వద్ద ఉంది. కాళ్లు పట్టుకున్నా, సాష్టాంగ నమస్కారం చేసినా కూడా వదిలేది లేదు. పార్టీలో చేరతామని చెప్పినా ఒప్పుకునేది లేదు. మంచోళ్లైతే తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు. అలా కాదని అధికారం ఉందని అప్పట్లో విర్రవీగిన వారు.. ఇప్పుడు పార్టీలోకి వస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. అలా వస్తామంటే ఫస్ట్ ఎదురు తిరిగేది నేనే. అప్పుడు అని.. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటామని.. సారీ చెప్తే అంగీకరించేది లేదు.” అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళి.. ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జన్మలో రాజకీయాలు మాట్లాడనంటూ పోసాని ప్రకటించారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానన్న పోసాని కృష్ణమురళి.. మంచి చేసినప్పుడు పొగడటం, తప్పులు చేసినవారిని విమర్శిస్తూ వచ్చానన్నారు. అయితే ఇకపై రాజకీయాల గురించి మాట్లాడబోనని.. సినిమాలకు, కుటుంబానికి కేటాయిస్తానంటూ ప్రకటించారు. అయితే చంద్రబాబు, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.