వినాయక చవితి వ్రతకథ చదివితే వింటే ప్రతిఫలం పక్కా! సింపుల్​గా స్టోరీ మీకోసం!!

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ వ్రతమైనా, పూజ అయినా పూర్తి అయిన తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణం అయినట్లు లెక్క. ముఖ్యంగా వినాయక చవితి పూజలో కథకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వినాయకచవితి కథ చదువుకొని పూజాక్షితలను శిరస్సున వేసుకుంటే చవితి చంద్రుని చూసిన దోషం పోతుందని శాస్త్ర వచనం. అంతటి మహత్యం ఉన్న వినాయక చవితి కథను ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.

god 8776552 640

వినాయక చవితి కథను

పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని, పోగొట్టుకుని, భార్య, సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు. అంతట సూతమహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించారు.ఒకసారి కైలాసంలో కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి టతండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశ వృద్ధిని పొంది, సమస్త కోరికలు తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండిట అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్ర లేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గానీ, వెండితో గానీ లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేత గంధాక్షత, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూప దీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేద విదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి.బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లో అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’అని పరమశివుడు కుమార స్వామికి చెప్పాడు.పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు టస్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు.ఇటు కైలాసంలో పార్వతి భర్త జాడ తెలియక వెతుకుతూ చివరకు శివుడు గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. శివుని రక్షించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్ధించగా శ్రీహరి బ్రహ్మాది దేవతలతో కలిసి గంగిరెద్దు మేళం వేషంలో గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయించగా గజాసురుడు పరమానంద భరితుడై ‘ఏమి కావాలో కోరుకోమనగా శ్రీహరి గజాసురుణ్ణి శివుని జాడ తెలియక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి కాబట్టి శివుణ్ణి అప్పగించమని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీహరియే అని గ్రహించి తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. ఆ విధంగా గజాసురుని ఉదరం నుంచి బయటకు వచ్చిన శివుడు నందినెక్కి కైలాసానికి బయలు దేరాడు.ఇటు కైలాసంలో పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త తెలిసి పార్వతి పతికి స్వాగతం చెప్పడానికి అభ్యంగన స్నానం చేయదలచి తన దేహానికి ఉన్న నలుగుపిండితో ఓ బాలుని తయారు చేసి ఆ బాలునికి ప్రాణం పోసి ఎవరిని లోనికి రానీయవద్దని బాలుని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఇటు పరమశివుడు కైలాసానికి వచ్చిన శివుని ఆ బాలుడు లోనికి అనుమతించలేదు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరకు శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి వేసాడు. జరిగిన ఘోరం చూసి పార్వతి దేవి దుఃఖంతో నాధా! పసివానిని ఇలా దండించడం న్యాయమేనా! అని విచారించడం చూసిన శివుడు ఉత్తరం దిక్కున తలపెట్టి అవసాన దశలో ఉన్న గజాసురుని శిరస్సు తెచ్చి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు

2e0928aa 6c0d 44f8 a4ef f42064bc3fa2 1

.వినాయకునికి గణాధిపత్యం

ఒకసారి కైలాసంలో పరమశివుడు తన కుమారులలో ఎవరు ముందు భూమిలోని సమస్త తీర్ధాలు నదులలో స్నానం చేసి త్వరగా తిరిగి వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తానని చెప్పగా కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరగా వినాయకుడు తండ్రి నా ఆసక్తి తెలిసి ఇలా ఆంతటి ఈయడం తగునా! అని అనగా అప్పుడు శివుడు కుమారా! ఎవరైతే నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వ తీర్ధాలలో స్నానం చేసిన ఫలితం ఉంటుందని చెప్పగా వినాయకుడు అలాగే చేసాడు.ఇక్కడ కుమారస్వామి ఎక్కడకు వెళ్తే అక్కడ వినాయకుడు తనకంటే ముందే రావడం చూసి కైలాసానికి వెళ్లి వినాయకునికి గణాధిపత్యం ఇవ్వమని తండ్రికి చెబుతాడు

1c1ebb84 a70d 47d9 a173 8c49c7a1d2a2

.గణపతికి గణాధిపత్యం

భాద్రపద శుద్ధ చవితి రోజున శివుడు వినాయకునికి గణాధిపత్యం ఒసంగుతాడు. ఆ రోజు ముల్లోకాలు గణపతిని పూజించి ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను నివేదించగా వినాయకుడు వాటిల్లో కొన్ని తిని కొన్ని తన వాహనమైన మూషికానికి ఇచ్చి మరికొన్ని చేతిలో పట్టుకొని కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించబోవగా ఉదరం సహకరించక ఇబ్బంది పడుతుంటే శివుని శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వుతాడు.

7d12c209 7fdf 4c21 ba60 ac7a72518ede
గణపతి అవస్థ

చంద్రుని నవ్వుకు గణపతి తీవ్రమైన ఆవేశానికి లోనుకగా అతని ఉదరం పగిలి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. అది చూసి ఆగ్రహించిన పార్వతి చంద్రుని చూసి కోపంతో నా కుమారుని చూసి నవ్వావు కాబట్టి నిన్ను చూసిన వారు ఉండరు కాక! కాదని చూస్తే నీలాపనిందలు కలుగుగాక! అని శపించింది. ముల్లోకాలు ఆ పార్వతీ దేవి శాపానికి తల్లడిల్లి చంద్రుని చూడకున్నా జనాలు ఎలా ఉండగలరు? చంద్రుడు లేకుంటే దివి రాత్రులు ఎలా సాగుతాయి? శాపానికి ఉపశమనం చెప్పమని ప్రార్ధించగా అప్పుడు పార్వతి కేవలం భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుని పూజించి కథను విని పూజాక్షితలను శిరస్సున వేసుకుంటే నీలాపనిందలు కలుగవని శాపోపశమనం వివరించింది.

29cba458 0c2d 4c79 b3a7 95bc491f0b37

ఋషి పత్నులకు నీలాపనిందలు

సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. అప్పుడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అహల్య తప్ప తక్కిన ఋషి పత్నుల రూపాన్ని ధరించి తన పతికి ప్రమోదాన్ని కలిగించింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్య లేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు.

శమంతోపాఖ్యానం2245b4cf d0f2 4d84 8005 3071c1828523

శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి.అలా వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహ లోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని తీసుకుని బయటకు రాసాగాడు. అది చూసిన జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు.శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు

ఫలశృతి
ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

Join WhatsApp

Join Now