ఫోన్లలో మునిగిపోతే మునిగి…పోతాం…
ఇది యుద్ధ సమయం…శత్రువులు పాకిస్తాన్ లోనో…చైనా అమెరికాల్లోనో లేరు…
మాక్ డ్రిల్ లో కొన్ని గంటల పాటు ఫోన్ ఉపయోగించకుండా కూర్చుని దిక్కులు చూసే శిక్షణ కూడా అవసరం…
ఉక్రెయిన్ రష్యా విమానాలు ఏక కాలంలో ఎయిర్ డ్రోమ్స్ లోకి వచ్చి పేల్చేసింది…
ఇజ్రాయిల్ ఇరాన్ లో ఎప్పటినుంచో పాగా వేసుకుని కూర్చుని…టైం రాగానే ఆర్మీ చీఫ్స్ నే లేపేసింది…
అంతెందుకు…పాలస్తీనా వాళ్ళు…ఇజ్రాయిల్ కొంపల్లో ముప్ఫై ఏళ్ళు పనివాళ్లుగా పని చేసి …హఠాత్తుగా వెన్నుపోటు పొడిచారు…
ఇంకా ఎన్ని వింతలు ఉన్నాయి…వాడెవడో ప్రధాన బ్రిడ్జిలు క్రింద ముష్టోడిలా పడుకుని…రోజూ రెండు మూడు స్క్రూలు… బోల్టులు.. నట్లు ఊడబీకుతూ పోతున్నాడు..
మరొకడు కూరగాయలు అమ్ముకుంటూ… ఆర్టిలరీ డిపోల ఆనుపానులు కనిపెడుతున్నాడు…
వాడెవడో…రోజూ స్మశానాల్లో సమాధులకు నీళ్లు పోస్తూ…ఆ పక్కనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు…
ఇంకొకత్తే…వలపు వలతో ఆర్మీ అధికారులను బిగిస్తోంది…
మరొకామె రీల్స్ లో హొయలు ఒలకబోస్తూ… జీవితాల మీద నీళ్ళు గుమ్మరిస్తోంది…
విపత్కర పరిస్థితుల్లో యుద్ధ సమయంలో నువ్వు నిశ్శబ్దంగా ఉండడానికి..లేదా ద్రోహం చెయ్యడానికి…మేధో పరమైన విషాన్ని నింపుతూ మరికొందరు…
వాడు ఫోన్ ను..సోషల్ మీడియాను…దేశాన్ని దెబ్బ కొట్టడానికి ఉపయోగిస్తున్నాడు…
మనం….
చుట్టు పక్కలు చూడడం…మనుషులను గమనించడం ఎప్పుడో మానేశాం…
కబుర్లు చెప్పుకోవడం…లోకాభిరామాయణాలు లేకుండానే పోయాయి…
ఊర్లో కొచ్చిన కొత్తవాడిని ఆరాతీయడం ఎప్పుడో పోయింది…
అంతెందుకు…షాపుల్లో కస్టమర్లను పలకరించే అలవాటు కూడా పోయింది…
ఫోన్ చూసుకుంటూనే…కొనుగోలు అమ్మకాలు అయిపోతున్నాయి…
అప్రమత్తత లేనే లేదు…
మోడీ లేదా ఎంతటి యాంటీ మిస్సైల్ డోమ్ కూడా నీ పక్కింట్లో జరిగే కుట్రను ఎలా ఆపుతాడు లేదా ఆపుతుంది…
ఒక్కసారి గమనించండి…తలెత్తి చూడండి…ఫోన్లో మునిగిపోయిన… తలదించుకున్న జాతి కనపడుతుంది…
సీసీ కెమెరాలు ఏం చేస్తాయి…సైన్యం ఏం చేయగలుగుతుంది…
ఇది తీవ్రమైన వ్యాధిలా మారిందని అనిపించడం లేదా…
ప్రమాద తీవ్రత తెలియడం లేదా…
ఇది కేవలం వ్యక్తిగతమైన జబ్బు కాదు…మనల్ని అందరినీ సర్వ నాశనం చేసే అణుబాంబు…
చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా… ఫోనుల్లో చూపు చిక్కుకున్నవాడా…
పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్టు త్రాగడం నిషేధించడం కంటే…ఫోన్ ఉపయోగించడం నిషేధించడం అత్యవసరం ఏమో అనిపిస్తోంది…
ఒక్కటే అదృష్టం అనుకోవాలి…
ఫోన్లో మునిగిపోవడం వల్ల…ప్రమాదాలు గమనించుకోకుండా…ప్రశాంతంగా పైకి పోయే అవకాశాలే ఉన్నట్టున్నాయి…
ఫోన్లోనే తన చావు తను చావాలని కోరుకునే జాతి గురించి…మనం ఎక్కువ బాధ పడుతున్నామా…