తమ చికిత్స కేంద్రాలను ఎన్ ఎం సి 54 యాక్టు ప్రకారం తనిఖీలు చేసి చట్ట విరుద్ధంగా ఉంటే అరెస్ట్ చేయాలి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా. అరవింద్, సభ్యులు డా. పుట్ట మల్లికార్జున్, డా. రమేష్ బాబు, డా. చంద్రశేఖర్, డా. ఉమారెడ్డి, డా. నవీన్, డా.జమాల్, డా.రమేష్ కొటాయ్, డా. రవికిరణ్, డా. గీరెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆర్ఎంపీ, పిఎంపి లకు శిక్షణ ఇచ్చేలా చూస్తామని చెప్పడం సరికాదనీ, వాళ్లకు 3 నెలల్లో శిక్షణ ఇచ్చి ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఏడెనిమిది సంవత్సరాల పాటు చదువుకుని శిక్షణ పొంది వైద్యులుగా కొనసాగుతున్నాము అన్నారు. ఎన్ ఎం సి 34 యాక్టు ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎన్ ఎం సి 54 యాక్టు ప్రకారం తనిఖీలు చేసి చట్ట విరుద్ధంగా ఉంటే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎలాంటి శిక్షణ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా గ్రామాల్లో వైద్యులుగా కొనసాగుతామంటే నాయకులు వారికి ఎలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు ఆర్ఎంపీ, పిఎంపిల వైపు మాట్లాడటం సరికాదన్నారు. వైద్యులంటే మీకు ఎందుకు వివక్ష. మేము తెలంగాణ బిడ్డలం కాదా. ఆర్ఎంపీ అనే పదం వాడటానికి వీల్లేదు. వీళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. పిఎంపి అయినా వారికి ఉన్న గుర్తింపు ఏదైనా ఉందా. గ్రామాల్లో వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అంతకుమించి చేయడానికి లేదు. కానీ గ్రామాల్లో ఇంజక్షన్ ఇస్తున్నారు, స్టెరాయిడ్స్, యాంటిబెటిక్ మందులు ఇస్తున్నారు. ఇల్లీగల్ అబార్షన్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి వాటిని నాయకులు సమర్థిస్తారా.. గ్రామీణ వైద్యులైన తమపై దాడులు చేస్తున్నారనే సాకుతో ఆర్ఎంపీ, పిఎంపిలు ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వాలనడం సరికాదు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. ఆర్ఎంపీ, పిఎంపిలపై మాకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. శిక్షణ ఇవ్వాలంటే ఇస్తాం, మేము చెప్పిన విధంగా వాళ్ళు ఉంటారా చెప్పాలన్నారు. ఆర్ఎంపీ, పిఎంపిలను రాజకీయాల కోసం పావులుగా వాడుకుంటున్నారనీ పిఎన్పిఆర్ఎంపీలు గుర్తించాలన్నారు.