అక్రమ నిర్మాణాల జోరు… అధికారులు కంటికి రెప్పలా చూసినా చూడనట్లే!
వెస్ట్ గాంధీనగర్, సూర్యనగర్ కాలనీల్లో టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 29
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో అక్రమ నిర్మాణాల జోరు ఆపట్లేదు. వెస్ట్ గాంధీనగర్ మరియు సూర్యనగర్ కాలనీల్లో అనుమతులు ఒకలా తీసుకొని, భవనాలు మాత్రం మరోలా – అదనపు అంతస్తులు కట్టేస్తున్నారు. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా… మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
స్థానికులు చెబుతున్నదేమిటంటే – ఈ నిర్మాణాలపై ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా, ఏమీ జరగనట్లే పరిస్థితి. “మామూలు పౌరుల ఇళ్లపై చిన్న తప్పిదం కనపడినా నోటీసులు ఇస్తారు… కానీ ఇక్కడ మాత్రం ఎవరి ఆశీర్వాదం ఉందో తెలియదు, చర్యలు మాత్రం లేవు” అని వాసులు మండిపడుతున్నారు.
అధికారుల ఈ నిర్లక్ష్యం వెనుక ఎలాంటి డీల్ ఉందో? అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి. అనుమతులు ఒకలా – నిర్మాణాలు మరోలా అనే ఈ అక్రమ భవనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.