Headlines in Telugu:
-
టేకు ఫర్నిచర్ అక్రమ రవాణా అడ్డుకున్న గ్రామస్తులు
-
ప్రజల అప్రమత్తతతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట
-
అటవీ శాఖ రేంజర్: “అంతా సక్రమమే” – గ్రామస్తుల్లో అనుమానం కొనసాగుతూనే ఉంది
-
కలప రవాణా కేసు: ఫారెస్ట్ అధికారుల తీరుపై ప్రజల ప్రశ్నలు
-
ప్రకృతి రక్షణలో ప్రజల చురుకైన పాత్ర
*గ్రామస్తుల అప్రమత్తతతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు*
*అంతా సక్రమమే అంటున్న అటవీ శాఖ రేంజర్ అధికారి*
జిల్లాలోని నెన్నెల మండలానికి చెందిన లేడీ ఫారెస్ట్ బీట్ అధికారిని భర్త ఇంటి సామాను తరలింపు చేస్తూ, పాత సామాన్ల కింద కొత్తగా చేసిన టేకు ఫర్నిచర్‌ను దాచిపెట్టి, జిల్లాలోని ఆవుడం గ్రామం నుంచి గద్దె రాగిడికి తరలిస్తుండగా గ్రామస్తులు ఆ వాహనాన్ని అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సామాగ్రిని తరలిస్తున్న క్రమంలో జిల్లాలోని మందమర్రి మండలం మామిడి గట్టు మార్గమధ్యంలో గ్రామస్తులు తమ వంతు సామజిక బాధ్యతగా, అనుమానంతో వాహనాన్ని నిలిపి, వివరాలు అడగగా, వాహనంలో కొత్త టేకు వస్తువులు ఉన్నమాట నిజమే, కానీ వీటికి సంబంధిత ధ్రువపత్రాలు ఉన్నాయంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. వారి మాటలకు అనుమానం వచ్చిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు, పాత్రికేయులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని, వాహనాన్ని తనిఖీ చేసి, దానిని స్వాధీనం చేసుకొని, వాహనాన్ని మంచిర్యాల పట్టణం హమాలివాడలో ఉన్న ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు, ఇది అక్రమమైన రవాణాగా తేలితే వాహనాన్ని, కలపను సీజ్ చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. అనంతరం రేంజర్ అధికారిని ఈ విషయమై సంప్రదించగా, అంత సక్రమంగా ఉందని తెలిపారు.
ప్రజల అప్రమత్తతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట*
ప్రజలు అప్రమత్తంగా ఉండటం వలన అక్రమ రవాణా అడ్డుకట్ట వెయ్యవచ్చునని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారులకు సమాచారం అందించడంలో స్థానికులు చురుకైన పాత్ర పోషించారని, ఇలాంటి చర్యలు కొనసాగి, ప్రకృతి సంపదను రక్షించడంలో అందరి సహకారం అవసరమని అధికారులు గ్రామస్తులను అభినందించారు.
ప్రజల్లో తొలగని అనుమానం*
కలప అక్రమ రవాణా అనుమానంతో వాహనాన్ని ఆపి, ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పితే, అధికారులు అంతా సక్రమంగానే ఉందని చెప్పినప్పటికీ ప్రజల్లో నెలకొన్న అనుమానం ఇంకా తొలగిపోలేదు. గతంలో సదరు ఫారెస్ట్ అధికారిని స్థానికంగా విధులు నిర్వహించిన సమయంలో గ్రామస్తులను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసి, దొంగ కేసులు బనాయించిందని బాహటంగానే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ పైఅధికారుల అండదండలతో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఒకటే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కావడంతో రవాణాలో ఏదైనా అక్రమం ఉన్న, వారిని వారు కాపాడుకుంటారని, గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేలా, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు సహకారం అందిస్తే, ప్రకృతి సంపదను, ప్రజా సంపదను కాపాడిన వారమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.