దోమకొండలో జనవాసాల్లో వైన్స్ వద్దని మహిళల బహిరంగ హెచ్చరిక
అధికారులు డబ్బులు తీసుకుని మద్య
వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
వైన్స్‌ను రద్దు చేసే వరకు నిరంతర పోరాటమే లక్ష్యం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ప్రశ్న ఆయుధం నవంబర్ 22
కామారెడ్డి జిల్లా పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో జనావాసాల మధ్య వైన్స్ దుకాణాలు ఏర్పాటు చేయరాదని మహిళలు, యువత, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మద్యం వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా నిర్వాహణ చేస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. దోమకొండకు కేటాయించిన వైన్స్ దుకాణాలను బీబీపేట రోడ్డులోని జనావాసాల నుండి దూరంగా మార్చకపోతే పోరాటం కొనసాగుతుందని మహిళలు, యువత హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా ప్రజలు ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ, గ్రామపంచాయతీ, పోలీసు విభాగాలకు వరుసగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి అధికారులు మద్యం వ్యాపారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మహిళలు ఆరోపించారు. జనావాసాల మధ్య వైన్స్ ఉంటే మహిళలకు అసౌకర్యం, విద్యార్థులకు ఇబ్బందులు, బస్టాండ్ ప్రాంతంలో అసభ్య ప్రవర్తన వంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు వివరించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి కూడా మహిళలు, యువత తమ అభ్యంతరాలను తెలియజేశారు. ప్రజల నిర్ణయాన్ని విస్మరించి వైన్స్‌కి అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
దోమకొండ మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు—
“జనావాసాల మధ్య వైన్స్ వద్దు… పట్టణానికి దూరంగా మార్చేవరకు పోరాటం ఆపేము” అని.