కులవ్యత్యాసం కలెక్టర్ నిర్ణయంలోనా..?
తిమ్మాపూర్‌లో డెంగ్యూ జ్వరంతో 10 రోజుల్లో ముగ్గురు యువకుల మృతి
పారిశుద్ధ లోపంపై పంచాయతీ కార్యదర్శి శైలేష్ సస్పెన్షన్
స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో రామ్‌రెడ్డి పైన మాత్రం చర్యలేమి…?
దళితుడు కాబట్టి కార్యదర్శిపై చర్యా..? రెడ్డి కాబట్టి వదిలేశారా..?
వెంటనే రామ్‌రెడ్డిని సస్పెండ్ చేయకుంటే పోరాటమంటున్న ఎమ్మార్పీఎస్
మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పోసానిపల్లి రాజు
జగదేవపూర్, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం):
తిమ్మాపూర్ గ్రామంలో విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. పారిశుద్ధ లోపాల కారణంగా గత రెండు నెలలుగా గ్రామస్థులు ఇబ్బందులు పడుతుండగా, కేవలం పదిరోజుల్లో ముగ్గురు యువకులు డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శి శైలేష్‌ను సస్పెండ్ చేశారు.
అయితే, ఇదే విషయంలో స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఎంపీడీవో రామ్‌రెడ్డి పైన చర్యలు తీసుకోకపోవడంపై మండలంలోని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పోసానిపల్లి రాజు తీవ్రంగా ప్రశ్నించారు. “గ్రామ కార్యదర్శి దళితుడు కాబట్టి చర్యలు తీసుకున్నారు. కానీ రామ్‌రెడ్డి రెడ్డి కాబట్టి వదిలేశారా?” అని ఆయన నిలదీశారు.
గ్రామానికి ప్రధాన బాధ్యత వహించాల్సిన స్పెషల్ ఆఫీసర్ రామ్‌రెడ్డి, రెండు నెలలుగా వ్యాధులు విస్తరిస్తున్నా కలెక్టర్‌కి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడమే కాకుండా శానిటేషన్ పనులు నామమాత్రంగా చేసి వదిలేశారని ఆయన ఆరోపించారు.
“గ్రామ కార్యదర్శి కంటే ఎక్కువ బాధ్యత స్పెషల్ ఆఫీసర్‌కే ఉంటుంది. వెంటనే రామ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలి. లేకుంటే కలెక్టర్ కులవ్యత్యాసం పాటిస్తున్నట్టే తేలుతుంది” అని హెచ్చరించారు. చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదని కూడా స్పష్టం చేశారు.