నశ్రుల్లాబాద్‌లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
“గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడం ప్రభుత్వ లక్ష్యం” — కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24
సోమవారం
నశ్రుల్లాబాద్ మండలంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ను ఎంపీ సురేష్ షెట్ట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీ ప్రతినిధి కాసుల బాలరాజు కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ—
రూ.1 కోటి 43 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో ఈ PHC నిర్మించబడిందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్యసేవలు, ప్రసూతి సేవలు, సాధారణ చికిత్సలు, ప్రయోగశాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు.
శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ—
ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని, ఈ కేంద్రంతో స్థానికులకు నాణ్యమైన వైద్యసేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ— పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రమైన వాతావరణం, పౌష్టికాహారం, ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఆహారం అత్యంత అవసరమన్నారు.
“పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వాలి. చిన్న రోగాల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తల్లులే తీసుకోవాలి” అని హితవు పలికారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, DMHO విద్య, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.