సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీపరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్య భారత్ నేడు 78 వసంతాలను పూర్తి చేసుకుందని అన్నారు. ఈ సందర్భంలో ఆ మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. బానిస సంకెళ్ళను తెంచుకొని సాధించుకున్న ఈ స్వాతంత్ర్య భారత రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, భారతదేశం శత్రు దేశాలచే చుట్టుముట్టబడి ఉన్న దేశాల నుండి, అంతర్గత శత్రువుల ముప్పుల నుండి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, పోలీసులుగా మన పాత్ర అత్యంత కీలకమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మన విధులు, సమాజానికి అందించాల్సిన సేవలను గుర్తు చేసే వేడుకలని, భిన్న భాషలు, జాతులు, మతాల సమ్మిళితం మన భారతదేశం అని, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్న వ్యక్తులు మరియు సమూహాల మధ్య సామరస్యం, ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. భారతీయులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరం గర్వపడాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మన విధులను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తే సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలకు సమానంగా మన సేవలు నిలుస్తాయని గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అదే ధృఢసంకల్పంతో తమ కర్తవ్యాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారు ఇ.కళ్యాణి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్. డి.యస్.పి ఎ.నరేందర్, యస్.బి. ఇన్స్పెక్టర్స్ కిరణ్ కుమార్, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఆర్.ఐ.లు రామరావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, యస్.బి.,డి.సి.ఆర్.బి. యస్.ఐ. లు, డి.పి.ఒ సూపరింటెండెంట్లు అశోక్, మోహనప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Oplus_131072