భాజపాతో కుమ్మక్కు అవుదామని భారాస ప్రయత్నాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. భారాసను భాజపా నమ్మదని.. ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్‌లోని మల్లన్న సాగర్‌ను సందర్శించిన మైనంపల్లి.. భారాసపై విమర్శలు గుప్పించారు.హైదరాబాద్ కూకట్‌పల్లిలో కొంతమందికి కాలేజీలు, పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని పేదల పేర్లతో నిర్వహిస్తున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ దృష్టి పెట్టాలి. హైడ్రాపై విష ప్రచారంతో చేయడం ద్వారా తెలంగాణని అల్లకల్లోలం చేయాలని కేటీఆర్, హరీశ్‌రావులు ప్రయత్నిస్తున్నారు. దత్తత గ్రామం కోల్గురులో కొన్ని ఇళ్లను బుల్డోజర్లతో స్వయంగా కూల్చి వేయించిన హరీశ్‌రావు.. ఇప్పుడు బుల్డోజర్లకు అడ్డం పడుకుంటా అని మొసలి కన్నీరు కారుస్తున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు మీకు పట్టదా? హైడ్రా బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావు.. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీ నేరవేర్చాలి’’ అని మైనంపల్లి డిమాండ్ చేశారు.‘‘పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది. మంచి ఉద్దేశంతో హైడ్రా ప్రారంభిస్తే కావాలని విష ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నారు. భారాస హయాంలో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఖర్చు చేసినట్టు కాంగ్రెస్, భాజాపాలు చేయలేదు. వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయించి బలిపశువుని చేశారు. ఆయనతో రూ.250 కోట్లు ఖర్చు పెట్టించారు. కమీషన్లు లేకుండా ఏ పనైనా చేశామని కేటీఆర్, హరీశ్‌రావు ప్రమాణం చేయగలరా? పేదవారి కోసం మేం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం’’ అని పేర్కొన్నారు.