రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిది*
*ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*
*ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 27 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు,సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై పాల్వంచలోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ,గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సమీక్షలో జిల్లాల్లో వర్షాభావం, వరద ముంపు,సీజనల్ వ్యాధులు,ఎరువుల సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, వనమహోత్సవ కార్యక్రమం,విద్యా రంగ అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించబడింది.భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్,ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు జిల్లాల ప్రస్తుత పరిస్థితులపై వివరాలు ఇచ్చారు.
*ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ*
భారీ వర్షాలు, వరదలను ఎదుర్కునేందుకు యాక్షన్ ప్లాన్ తో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.ఇందిరా సౌర జలవికాసం పథకం కింద ఈ రైతులకు సోలార్ పంపులు,డ్రిప్, స్ప్రింక్లర్లు,ఉద్యానపంటల సాగుకు ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల్లో రూ.12,600 కోట్లు ఖర్చు చేసే ఈ పథకం ద్వారా గిరిజన రైతుల అభివృద్ధి జరుగుతుందన్నారు.
ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 25 ఎకరాల స్థలంలో నిర్మించాలని, ఈ పాఠశాలలు ఇతర విద్యా సంస్థలకు ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై వర్షాకాలంలో ప్రత్యేక దృష్టి అవసరమని,వైద్య పరీక్షలు నిరంతరం నిర్వహించాలని సూచించారు.జిల్లావ్యాప్తంగా పేదల సంక్షేమానికి, పేదలను ఆర్థికంగా అభివృద్ధి పరచడానికే మహాలక్ష్మి పథకం,500 కే గ్యాస్ బండ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారన్నారు.భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి,ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. దీనికిగాను ప్రతి సోమవారం వారం నిధులు విడుదల చేస్తున్నామన్నారు.మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడానికి గాను బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.చేపపిల్లల పంపిణిలో ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించడం ద్వారా వారిని అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
*ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ*
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పని చేయాలని అన్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని,రైతుల సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని,యూరియా తక్కువ ఉన్నట్టు తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యాభివృద్ధికి మలుపుతిప్పే కార్యక్రమమని అభివర్ణించారు. ఆగస్టు రెండో వారంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు.గత ప్రభుత్వం కంటే ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తూ ప్రస్తుతం110 ఎం ఎం చేప పిల్లలు పంపిణీ చేయడంతో పాటుగా, కౌంటింగ్ ప్రకారం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువు గట్ల పైన చెరువు సామర్థ్యం,ఎన్ని చేప పిల్లలు పెంపకం చేపడుతున్నాం,వాటి యొక్క ఉత్పత్తి ఎక్కడ నుంచి మరియు వాటి ఖర్చు తదితర పూర్తి వివరాలు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తో పాటు ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో ఐదు మొక్కలను నాటే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
*మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.* .
రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.గత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు లేవన్న ఆయన,ఈ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయడంపై కట్టుబడి ఉందన్నారు. వరదలు,వర్షాలకు సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లాలో సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని,రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
*మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..*
అధికారులు ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుంచుకొని పనిచేయాలని అన్నారు.వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణ చేపట్టాలన్నారు. రెవెన్యూ శాఖలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకుని పంపిణీ చేయు విధంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెలలో శ్రావణమాసం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరిగేటట్లు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతివారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదవారి సంక్షేమం కోసం రూపొందించిన పథకం అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకోవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరితగతను పూర్తి చేయాలన్నారు.రహదారుల వెంట ఏర్పడిన గుంటలను పూడ్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.వర్షాకాలం నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, అలా జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు.తీసుకోవాలన్నారు.ఆస్పత్రులు, వసతి గృహాలు పర్యవేక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ప్రతి నెల ఒక ప్రణాళిక ద్వారా ఆసుపత్రులు వసతి గృహాలు పరిశీలించి నివేదికలు అందచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్,ఎస్పి రోహిత్ రాజు,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డి,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య,అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్,సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి,అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య,టి జి ఐ డి సి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు చారిత్రాత్మక పథకం
by Naddi Sai
Published On: July 27, 2025 8:21 pm