“ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్”
ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి చూపాలి — జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు”
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి, అక్టోబర్ 15
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ డీఈలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో 11,679 ఇళ్ల నిర్మాణానికి మహిళల పేరున అప్రూవల్ ఇచ్చినట్లు వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఇప్పటికే ఆమోదం పొందిన ఇళ్లకు వెంటనే మార్కవుట్ ఇచ్చి, నిర్మాణం బేస్మెంట్ స్థాయికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే 15 రోజుల్లో అన్ని దశలలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు కావలసిన ఇసుక సరఫరా, ఆర్థిక సహాయం విషయంలో ఐకెపి, ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డీఆర్డీఓ సురేందర్, డీపీఓ మురళి తదితరులు పాల్గొన్నారు.