సిట్ అధికారుల విచారణ
షాద్ నగర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
పలువురు నాయకులను విచారించిన అధికారులు
సిట్ అధికారుల దృష్టికి పలు ఆధారాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసు షాద్ నగర్ వ్యవహారంలొ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చాక ఆయనను విచారించిన తర్వాత కేసులో దర్యాప్తు వేగం మరింత పెరిగింది. ఈ పరిణామాల్లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయాలకు కూడా ఈ మచ్చ అంటడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ముందుగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు స్థానిక బిజెపి నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారం తెరమీదకు రావడంతో ఈ అంశం కీలకమైంది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అధికారుల నుండి సమాచారం రావడంతో సమస్య మరింత జఠలమైంది. షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది ఎవరు? ఎందుకు అన్న కోణంలో కూడా జనాల్లో రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. తాజాగా సిట్ అధికారుల నుండి సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు నిన్న సిట్ దర్యాప్తుకు హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో రాజకీయాలను కలుషితం చేసి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు ఎవరు? వారు ఎలాంటి ప్రయోజనం పొందారు? అన్న కీలక ఆధారాలను చర్చించుకున్నట్లు సమాచారం. ఈ అవసరం ఎవరికీ ఉంది ఎవరు చేశారు ఎందుకు చేశారు? అతను ఎవరు? అన్న విషయాలు పక్కన పెడితే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వెంట రాసుకుపూసుకు తిరిగిన అనుచరుల ఫోన్లు కూడా
ట్యాపింగ్ కు గురయ్యాయి. ఆయనతో సత్సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నవారిని కూడా టార్గెట్ చేసే విధంగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు విశ్వసినీ సమాచారం అందింది. షాద్ నగర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ నుండి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కృష్ణారెడ్డి, రఘునాయక్, అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుడు నవీన్, కొందుర్గులో ఇద్దరు మైనార్టీల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా షాద్ నగర్ మైనార్టీ నాయకుడు జమ్రుద్ ఖాన్, పదో వార్డు మాజీ మహిళా కౌన్సిలర్ శ్రావణిల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు సమాచారం అందించారు. మైనారిటీ నాయకుడు జమ్రుద్ ఖాన్, శ్రావణిలు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి.
షాద్ నగర్ లో ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే శంకర్, ఎంపీ డీకే అరుణ, బిజెపి నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు సైతం షాద్ నగర్ లో “ఓ యువనేత” ఇదంతా చేశాడంటూ మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించిన విషయం విధితమే. అయితే ఈ వ్యవహారంపై అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారణ సందర్భంగా కీలక విషయాలు నేడో రేపో మీడియా ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి..! *KP*