రామేశ్వరం ధనుష్కోటిలో సామాన్య కుటుంబంలో జన్మించిన మహనీయుడు
చిన్ననాటి కష్టాలను అధిగమించి దేశ గౌరవస్థానంలోకి ఎదిగిన శాస్త్రవేత్త
విద్య, క్రమశిక్షణ, పట్టుదలతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన విజ్ఞానశీలి
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి భారత రాష్ట్రపతిగా అగ్రస్థానానికి ఎదుగుదల
నవతరానికి దారితీసిన కలల మనిషి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా కీర్తి
ప్రశ్న ఆయుధం హైదరాబాద్,
భారత విజ్ఞానగగనంలో వెలుగొందిన మహనీయుడైన డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం పేరు ప్రతి భారతీయ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన, పట్టుదలతో, కష్టపడి దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచారు.
చిన్ననాటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు అడ్డుగా నిల్చినా కలాం వెనుదిరిగలేదు. స్కూలు రోజుల నుంచే ఒక స్థిరమైన లక్ష్యంతో ముందుకు సాగాడు. చదువుపై ఉన్న ఆసక్తి, శ్రద్ధ, క్రమశిక్షణ ఆయన జీవితమంతా అనుసరించిన విలువలు. సెంట్ జోసెఫ్ కాలేజీ, తిరుచిరాపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతూనే సోదరుని దుకాణంలో పని చేశాడు. ఇంజనీరింగ్ కోసం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరేందుకు అక్క జోహర తన బంగారు ఆభరణాలు అమ్మి సహాయం చేయడం ఆయన జీవితంలో మలుపుగా మారింది.
తన సామర్థ్యంపై నమ్మకంతో సాధన కొనసాగించిన కలాం, దేశ రక్షణలో ప్రాణం పెట్టిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. స్వదేశీ మిసైల్ ప్రాజెక్టులు, అణు సాంకేతికతలో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టినందుకు ఆయనను “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పిలిచారు. శాస్త్రరంగానికి చేసిన విశిష్ట సేవలకుగాను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో సత్కరించబడ్డారు.
రాజకీయాలలోకి ప్రవేశించి, భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నారు. విద్యార్థులతో గడిపిన సమయం, యువతరానికి చెప్పిన ప్రేరణాత్మక మాటలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
“కలలు కని, వాటిని సాధించడానికి కష్టపడు” — ఈ ఒక మాటలోనే ఆయన జీవన సారమంతా ఉంది. రామేశ్వరం తీరాల నుండి రాష్ట్రపతి భవన్ వరకు చేసిన అద్భుత ప్రయాణం నేటి యువతరానికి శాశ్వత స్ఫూర్తి.
— కప్పర ప్రసాద్ రావు
(తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు..)
అక్టోబర్ 15 — డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి