గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా పాకిస్థాన్ ఆదివారం నుంచి కీలక చర్చలకు వేదికైంది. ఈ చర్చల్లో సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొంటున్నారు.
ఈజిప్ట్ విదేశాంగ శాఖ మంత్రి బదర్ అబ్దెలాటీ, పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ మధ్య ఇస్లామాబాద్‌లో ఆదివారం సమావేశం జరిగింది. త్వరలో తుర్కియే, సౌదీ అరేబియా మంత్రులతో కూడా సమావేశాలు జరగనున్నాయి. ఈ చర్చల పురోగతిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తెలియజేస్తారు.
గల్ఫ్ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడితో తాను చర్చించినట్లు ప్రధాని షరీఫ్ తెలిపారు.
మరోవైపు, యెమెన్‌లోని హౌతీల జోక్యంతో గల్ఫ్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బాబ్-ఎల్-మండేబ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తుండగా, గల్ఫ్‌కు అదనంగా అమెరికన్ సైనికులను తరలించారు.
ఇరాన్‌పై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడం వల్ల చమురు ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతోంది.










