అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి దేశ ప్రజలు ముందుకు రావాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఈ సందేశం విడుదల చేశారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడులు చేస్తున్నాయని, ఈ దాడుల వల్ల దేశ మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని మొజ్తాబా ఖమేనీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో, దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇరాన్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటు పడాలని, అభివృద్ధిని విస్తరించాలని మొజ్తాబా ఖమేనీ సూచించారు. దేశ పునర్నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో 186 మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి నివాళిగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యుద్ధంలో చనిపోయిన అమర వీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరూ సంఘటితంగా కృషి చేయాలని ఆయన కోరారు.











