మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య జరుగుతున్న దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరు దేశాలు హోరాహోరీగా దాడులు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్‌లోని ఉర్మియా, కెర్మాన్షా నగరాలకు కూడా దాడులు విస్తరించినట్లు సమాచారం. తూర్పు టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
మరోవైపు, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ క్షిపణులు సౌదీలోని ఎంబసీని, దుబాయ్‌లోని యూఎస్ కాన్సలేట్‌ను, ఖతార్‌లోని అల్ ఉదేద్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.
కెర్మాన్ ప్రావిన్స్‌లోని ఐఆర్జీసీ ప్రాంతీయ విభాగం, కెర్మాన్ సిటీ శివార్లలో ఇజ్రాయెల్‌కు చెందిన హెర్మేస్ డ్రోన్‌ను కూల్చేసినట్లు ప్రకటించింది. గత 24 గంటల్లో మూడు హెర్మేస్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. మధ్యప్రాచ్యంలోని ఇరాక్ 'ఎర్బిల్ బేస్', కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్‌బేస్, అరిఫ్జాన్ ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలపై ఇంతవరకూ 230 డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్ గత శనివారం టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్లో 800 మంది వరకు మరణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఐదు రోజుల్లో ఇరాన్‌లోని 1,700 లక్ష్యాలపై దాడులు జరిగాయి. వీటిలో నావికాదళ నౌకలు, సబ్మెరీన్లు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్నాయని వెల్లడించింది.

