అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌కు కఠినమైన అల్టిమేటం జారీ చేస్తూ, ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇచ్చిన 10 రోజుల గడువు ముగింపునకు వస్తోందని, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా, 'ఒప్పందం కుదుర్చుకునేందుకు లేదా హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు పది రోజుల గడువు ఇచ్చాను. సమయం మించిపోతోంది. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు మరో 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది' అని పేర్కొన్నారు.
గత నెల రోజులకు పైగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు లేదా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు ట్రంప్ ఈ గడువు విధించారు. ఈ లోగా తమతో ఒప్పందం చేసుకోవాలని, లేదంటే మరింత తీవ్రమైన దాడులకు సిద్ధంగా ఉండాలని ఇరాన్‌కు ఆయన స్పష్టం చేశారు.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, ట్రంప్ తాజాగా మరోసారి ఇరాన్‌ను హెచ్చరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ వైఖరిని బట్టి తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే, అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దానిపైనే అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.











